logo

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాన్ని వ్యతిరేక దిశలో నడుపుతూ ఆర్టీసీ బస్సును ఢీ కొని ఒకరు,

Published : 28 Sep 2022 02:39 IST

చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఘటనలు

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, చేవెళ్ల గ్రామీణం, న్యూస్‌టుడే: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాన్ని వ్యతిరేక దిశలో నడుపుతూ ఆర్టీసీ బస్సును ఢీ కొని ఒకరు, రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో మరొకరు.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టి ఇంకొకరు మృతి చెందారు.

శంకర్‌పల్లి ఎస్సై క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి పురపాలికలోని సింగాపురానికి చెందిన మోహన్‌రెడ్డి(42) రైతు. మంగళవారం ఉదయం తన ద్విచక్రవాహనంలో పెట్రోల్‌ పోయించుకొని.. వ్యతిరేక దిశలో వెళ్తుండగా.. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. దీంతో మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

డివైడర్‌ ఢీకొని ద్విచక్ర వాహనదారు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాశప్ప(35) మేస్త్రీ. కొన్నేళ్ల క్రితం శంకర్‌పల్లికి వలస వచ్చాడు. మంగళవారం దుస్తులు కొనేందుకు శంకర్‌పల్లికి వచ్చిన కాశప్ప.. తిరుగు ప్రయాణంలో అతివేగం, నిర్లక్ష్యంగా వెళ్తూ దొంతాన్‌పల్లి వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై క్రిష్ణ తెలిపారు.

గుర్తు తెలియని వాహనం.. షాబాద్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన  బైండ్ల బాల్‌రాజు(40) వ్యవసాయ కూలీ. అప్పుడప్పుడు మద్యం సేవించి చెప్పకుండా వెళ్లిపోతుంటాడు. మూడు నెలల క్రితం భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్లింది. బాల్‌రాజు సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య వద్దకు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అర్ధరాత్రి అల్లవాడ స్టేజీ వద్ద బెంగుళూరు-ముంబయి రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రదీప్‌ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు