logo

అన్నదాతకు సహకారం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులకు సద్వినియోగం చేస్తున్న రైతులు తిరిగి సకాలంలో చెల్లిస్తున్నారు. సంఘాలను ఆర్థికంగా బలోపేతం

Published : 28 Sep 2022 02:38 IST

రుణాల పంపిణీ.. కార్యకలాపాల విస్తరణ  
న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

మ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులకు సద్వినియోగం చేస్తున్న రైతులు తిరిగి సకాలంలో చెల్లిస్తున్నారు. సంఘాలను ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పడుతున్నారు.

2 లక్షలకు పైగా రైతులు
వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చేల్‌ జిల్లాల పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. వీటిలో 2లక్షలకుపైగా రైతులు నమోదయ్యారు. వీరికి సంఘాల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక, పంట రుణాలను తక్కువ వడ్డీకే అందజేస్తున్నారు. తక్కువ వ్యవధిలో రుణాల్ని మంజూరు చేయడంతో ఇతర సమస్యలు దూరమవుతున్నాయి. దీర్ఘకాలిక రుణాలతో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్‌లు, కల్టివేటర్‌, రోటవేటర్‌, గొర్రు, గుంటుక, హర్వేస్టర్‌, కలుపుతీతకు సంబంధించి వ్యవసాయ పరికరాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారు.  

రూ.కోట్లల్లో బంగారం తాకట్టు రుణాలు  
తాండూరు మండల సహకార సంఘం ద్వారా ఏకంగా రూ.12కోట్ల బంగారం తాకట్టు రుణాల్ని అందజేశారు. ఏటా రూ.కోటికిపైగా లాభాల్ని ఆర్జిస్తున్నారు. ఈ ఆదాయంతో సంఘానికి నూతన భవనాన్ని నిర్మించారు. త్వరలో నాబార్డు నిధులతో సిరిగిరిపేట శివారులో ఎకరా విస్తీర్ణంలో గోదాంల నిర్మాణానికి అధికారులు, పాలకవర్గం సన్నాహాలు చేస్తోంది. గోదాంలు అందుబాట్లోకి వస్తే వందలాది మంది రైతుల ఉత్పత్తుల్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగపడతాయి. రైతులు ప్రైవేటు ఫెర్టిలేజర్‌ దుకాణాలను ఆశ్రయించకుండా తక్కువ ధరకు యూరియా వంటి ఎరువులను సంఘాల ద్వారా సరఫరా చేస్తున్నారు.  

లక్ష్యం మేర సకాలంలో అందిస్తున్నాం: శ్రీనివాస్‌, సీఈఓ, డీసీసీబీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  
సహకార సంఘాల ద్వారా మూడు జిల్లాలోని రైతులకు సకాలంలో రుణాలు అందిస్తున్నాం. యంత్రాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు రుణాలు అందజేస్తున్నాం. ఇప్పటివరకు 50 శాతం రుణ లక్ష్యం చేరుకున్నాం. మిగిలిన లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని