logo

వైద్యులు లేరు... మందులు రావు

జిల్లాలో ఆయుర్వేద ఆసుపత్రులు ఉన్నవే తక్కువనుకుంటే వాటిలోనూ సిబ్బంది కొరత, మందుల లేక పోవడం వంటివి రోగులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడాదిలో ఒకటి, రెండుసార్లు మాత్రమే పరిమితంగా

Updated : 28 Sep 2022 04:30 IST

సమస్యలకు నిలయాలుగా ఆయుర్వేద ఆసుపత్రులు  
న్యూస్‌టుడే, కొడంగల్‌

జిల్లాలో ఆయుర్వేద ఆసుపత్రులు ఉన్నవే తక్కువనుకుంటే వాటిలోనూ సిబ్బంది కొరత, మందుల లేక పోవడం వంటివి రోగులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడాదిలో ఒకటి, రెండుసార్లు మాత్రమే పరిమితంగా మందులు వస్తున్నాయని సిబ్బంది అంటున్నారు. కొన్ని ఆసుపత్రులకైతే ఇన్నేళ్లలో 14 సంవత్సరాల్లో కేవలం మూడు సార్లు మందులు వచ్చాయని ఆయా ఆసుపత్రులో పనిచేసే సిబ్బంది చెపుతున్నారు. ఇందులో ఆయుర్వేదం, యునానికి సంబంధించి రెండు డిపార్టుమెంట్ల వారు చూస్తుండటంతో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం మరింత క్లిష్టంగా మారుతోంది.  

అటెండర్లే దిక్కు...: ఆయుర్వేద, యునాని ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలతో కొన్ని సందర్భాల్లో అటెండర్లే ఆపద్బంధువులుగా మారి రోగులకు మందులు అందిస్తున్నారు. తాండూర్‌ వంటి పెద్ద పట్టణాల్లో సైతం అటెండర్లే విధులు నిర్వహిస్తున్నారు. రుద్రారంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌ మాత్రమే ఉన్నారు. తాండూర్‌, వికారాబాద్‌, నవాబ్‌పేట, మోమిన్‌పేట ఇలా పలు ప్రాంతాల్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి.

వికారాబాద్‌ జిల్లాలో 5 రెగ్యులర్‌ ఆయుర్వేద ఆసుపత్రులున్నాయి. ఇందులో దుద్యాల, దౌల్తాబాద్‌, రుద్రారం, దోమ, తాండూర్‌లో కలిపి కేవలం దోమలో మాత్రం ఒకే ఒక్క డాక్టర్‌ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద 6 ఆసుపత్రులు కొనసాగుతున్నాయి. వీటిలో దాదాపు 15 ఖాళీలు ఉన్నాయి.  

కొడంగల్‌ మండలంలోని అంగడిరైచూర్‌ గ్రామంలోని ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిలేక రెండు సంవత్సరాలుగా మూతపడింది.  

ప్రతి మూడు నెలలకు ఒకసారి రావాలి...
ఆయుర్వేద, యునాని, హొమియో ఆసుపత్రులకు లెక్క ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి మందులు సరఫరా చేయాలి. అలా జరగడంలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న వాటితోనే రోగులకు అందిస్తున్నామని సిబ్బంది అంటున్నారు.

ఏడు నెలలుగా ఊసే లేదు : కొడంగల్‌ మండలంలోని రుద్రారం గ్రామంలోని ఆసుపత్రికి ఏడు నెలుగా మందులు రావడంలేదు. వస్తే ఇవ్వడానికి తాము సిద్ధంగా  ఉన్నామని అక్కడి ఫార్మాసిస్ట్‌ వివరిచారు.  

పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది

- వసంత్‌రావు, రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌, ఆయుష్‌ హైదరాబాద్‌
ఆయుష్‌ ఇతర వైద్యులకు సంబంధించి పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. త్వరలోనే భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. కరోనా కంటే ముందు మందులు నేరుగా ఆసుపత్రులకు అందించే వారు. ప్రస్తుతం అన్‌లైన్‌లో ఏ మందులు కావాలని ఆయా ఆసుపత్రి సిబ్బంది కోరితే వాటిని వెంటనే పంపిస్తున్నాం. మందులకు ఎలాంటి కొరత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని