logo

సంక్షిప్త వార్తలు

అంగట్లో సరకులా దొరుకుతున్న డేటా వెనుక గుట్టు కనిపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డబ్బు చెల్లిస్తే పేరు, ఫోన్‌ నంబరు, ఆధార్‌, పాన్‌, చిరునామా సహా కోరిన రూపంలో

Published : 28 Sep 2022 02:38 IST

డేటా చౌర్యంపై పోలీసుల నజర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంగట్లో సరకులా దొరుకుతున్న డేటా వెనుక గుట్టు కనిపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డబ్బు చెల్లిస్తే పేరు, ఫోన్‌ నంబరు, ఆధార్‌, పాన్‌, చిరునామా సహా కోరిన రూపంలో లక్షలాది మంది వ్యక్తిగత వివరాలను విక్రయిస్తున్న డేటా ప్రొవైడర్లను చట్టం ముందు నిలబెట్టనున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారిపై త్వరలో ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు.


యూపీఎస్‌సీలో రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి

గోల్నాక, న్యూస్‌టుడే: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ)లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌ పటేల్‌గౌడ్‌ కోరారు. మెరిట్‌ వచ్చిన వారిని ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేయాలన్నారు. ఆదివారం చాదర్‌ఘాట్‌ మోతీమార్కెట్‌లోని కార్యాలయంలో మంగళవారం బీసీ సంఘాల  సమావేశంలో మాట్లాడారు. మెరిట్‌ వచ్చిన వారిని కూడా రిజర్వేషన్‌ కోటాలో భర్తీ చేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నేతలు పులిజాల కృష్ణ, సాంబశివగౌడ్‌, దిలీప్‌ ఘనాతె, మాణిక్‌రావు పతంగె, ప్రశాంత్‌ నిమ్‌కర్‌, ప్రదీప్‌గౌడ్‌ పాల్గొన్నారు.


నిమజ్జన ప్రభావం.. ఆకుపచ్చగా సాగరం

ఈనాడు, హైదరాబాద్‌: సామూహిక గణేశ్‌ నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో నీటిపై తీవ్ర ప్రభావం చూపించింది.. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు రెండు లక్షలు నిమజ్జనం కావడంతో ఆయా విగ్రహాల మట్టి, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రసాయనాలు కలిసి సాగర్‌లో నీళ్లు ఆకుపచ్చగా మారిపోయాయి. నిమజ్జనం అనంతరం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు సంయుక్తంగా ఏడువేల టన్నుల వ్యర్థాలు తొలగించినా కాలుష్యం తగ్గలేదు సరి కదా.. మరింత పెరిగింది. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఏటా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు వివిధ దశల్లో ఆరు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నీటి నాణ్యతను పరీక్షించారు. ప్రాణవాయువు మరింత తగ్గిపోగా లోహాల సాంద్రత పెరిగింది.. బురద పేరుకు పోయిందని తేలింది.  


భూవివాదంలో 8 మందికి గాయాలు

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: భూవివాదం ఘర్షణతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. పహాడిషరీఫ్‌ ఠాణా పరిధిలోని మామిడిపల్లి గ్రామం 324 సర్వే నంబరులోని 14 గుంటల స్థలంపై మాజీ గవర్నర్‌ శివశంకర్‌ కుమారుడు, కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ వినయ్‌కుమార్‌కు గ్రామస్థుడు లాల్‌ సతీష్‌గౌడ్‌తో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. స్థలానికి వెళ్లే దారికి అడ్డంగా సతీష్‌గౌడ్‌ కంచె వేయిస్తుండగా.. వినయ్‌కుమార్‌, అతని కుమారుడు శాశ్వత్‌ అడ్డుకోవడంతో మంగళవారం ఘర్షణకు దారితీసింది. వినయ్‌కుమార్‌కు చెందిన 25 మంది బౌన్సర్లు, మరో ఇరవై మంది రౌడీలు తమపై దాడి చేశారని సతీష్‌గౌడ్‌ ఆరోపించారు. తమ స్థలం దారిలో కంచె వేస్తుండగా అడ్డుపడగా ఘర్షణ జరిగిందని వినయ్‌కుమార్‌ ఆరోపించారు. పోలీసులు రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని ఏసీపీ పేర్కొన్నారు. వారిలో రంగనాథ్‌, విజయ్‌కుమార్‌, భారతమ్మ, మహేందర్‌, అంజి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.


పోలీసు వాహనాలకూ తప్పదు చలానా!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పోలీసు వాహనాలన్నీ డీజీపీ పేరుతోనే రిజిస్ట్రేషన్‌ అవుతాయని నగర ట్రాఫిక్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం(ఈనెల 27న) ‘డీజీపీ వాహనానికి రూ.7000 ఫైన్‌.. డబ్బులు కట్టరా’? అంటూ టీఎస్‌09 పీఏ 1234 కారు ఫొటోను ట్విట్టర్‌లో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నగర ట్రాఫిక్‌ సంయుక్త సీపీ స్పందించారు. 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వాహనాల ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనపై 11,601 కేసుల్లో, రూ.28,85,640 జరిమానా చెల్లించారన్నారు. ట్విట్టర్‌లో పేర్కొన్న సదరు వాహనంపై బకాయిలన్నీ సంబంధిత పోలీసు అధికారి చెల్లించారని తెలిపారు. ప్రభుత్వ/ప్రైవేటు వాహనాలనే బేధం లేకుండా నిబంధనలు పాటించని అన్నింటిపై జరిమానా/కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు.


ముందే మ్యాచ్‌ ప్రారంభంపై హెచ్‌సీఏపై కేసు

బేగంపేట, న్యూస్‌టుడే: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 25న నిర్వహించిన మ్యాచ్‌ను పేర్కొన్న సమయం కంటే అరగంట ముందే ప్రారంభించి మోసం చేశారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదుతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)పై బేగంపేట పోలీసులు కేసు నమోదుచేశారు. మ్యాచ్‌ టికెట్లపై మ్యాచ్‌ సాయంత్రం 7.30కు ప్రారంభమని ముద్రించారు. దీనిపై బేగంపేటకు చెందిన న్యాయవాది ఉప్పల అరుణ్‌కుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని