logo

సంక్షిప్త వార్తలు

ప్రపంచ హృద్రోగ దినం పురస్కరించుకొని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వెల్‌నెస్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు....

Updated : 29 Sep 2022 03:03 IST

ఏఐజీలో నేడు ఉచితంగా గుండె ఆరోగ్య పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ హృద్రోగ దినం పురస్కరించుకొని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వెల్‌నెస్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న వారికి అనుబంధ పరీక్షలతోపాటు కన్సల్టేషన్‌ ఫీజులో మినహాయింపు ఉంటుందన్నారు.


ఫార్ములా-ఇ రేసింగ్‌ ట్రాక్‌ పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నగరంలో నిర్వహించే ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ట్రాక్‌ను నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా రేస్‌ జరిగే ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాలను మంగళ, బుధవారాల్లో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌, వారు పరిశీలించారు.


సిబ్బంది లేకుండానే స్మార్ట్‌ బిల్లింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు బిల్లుల జారీలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. కార్యాలయం నుంచే బిల్లుల రీడింగ్‌ నమోదు చేసే స్మార్ట్‌ బిల్లింగ్‌ ప్రక్రియను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ మొదలెట్టింది. మొదటగా అధిక ఆదాయం వచ్చే హెచ్‌టీ కనెన్షన్ల నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని కనెన్షన్లలో చేపట్టారు. డిస్కం పరిధిలో కోటికిపైగా విద్యుత్తు కనెన్షన్లున్నాయి. గ్రేటర్‌లోనే 55 లక్షలకుపైగా ఉంటాయి. ప్రతినెలా సిబ్బంది ప్రతి కనెన్షన్‌ దగ్గరికి వెళ్లి మీటర్‌ రీడింగ్‌ నమోదు చేస్తున్నారు. హెచ్‌టీ కనెన్షన్‌ అయితే ఏకంగా ఏడీఈ స్థాయి అధికారి బిల్లింగ్‌ తీస్తున్నారు. డిస్కం పరిధిలో 70 కిలోవాట్లు ఆపై సామర్థ్యం ఉన్న హెచ్‌టీ (ఐటీ కార్యాలయాలు, పరిశ్రమలు, మాల్స్‌) కనెన్షన్లు 10 వేలుంటాయి. వీటి నుంచే 60 శాతం ఆదాయం వస్తుంది.
అప్రమత్తం చేసే ఏఎంటీ.. డిస్కం పరిధిలో 1500 హెచ్‌టీ కనెన్షన్లకు ఏఎంటీ మీటర్లున్నాయి. ఇందులో సిమ్‌ ఉంటుంది. మోడెమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం కార్యాలయానికి చేరుతుంది. ఏఎంటీ ఆటోమేషన్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగంలో  హెచ్చుతగ్గులున్నా.. అసలు వినియోగమే లేకపోయినా ఇంజినీర్లను అప్రమత్తం చేస్తుంది.  


నగరంలో 411 కొత్త బస్‌ షెల్టర్లు!

ఈనాడు, హైదరాబాద్‌:  నగరంలో ఏడాదిలో నగరంలోని 411 ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రవాణ విభాగం ఇంజినీర్లు ఇటీవల టెండర్లు పిలిచారు. కొత్త బస్టాపులకు ఆధునిక డిజైన్లు రూపొందించామని, ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించడమేగాక, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఇచ్చే స్థలంలో.. బీఓటీ(బిల్ట్‌, ఓన్‌, ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో గుత్తేదారులు నిర్మాణాలు చేపడతారు. ఐదేళ్ల క్రితం అప్పటి కమిషనర్‌ నగరవ్యాప్తంగా 800లకుపైగా బస్‌షెల్టర్ల నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాజెక్టు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 411 బస్టాపులు నిర్మించాలని కొంతకాలం కిందట టీఎస్‌ఆర్టీసీ జీహెచ్‌ఎంసీని కోరింది. నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, టీఎస్‌ఆర్టీసీ ప్రతినిధులు సర్వే నిర్వహించి స్థలాలను ఎంపిక చేశారు. ఆయా స్థలాల్లో 5అడుగుల వెడల్పు, 5అడుగుల పొడవుతో బస్‌షెల్టర్లను నిర్మిస్తారు.


నలుగురు పీఎఫ్‌ఐ సభ్యులకు మూడు రోజుల కస్టడీ

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: చంచల్‌గూడ జైల్లో ఉన్న నలుగురు నిషేధిత పీఎఫ్‌ఐ సభ్యులను 3 రోజుల కస్టడీ విచారణకు ఎన్‌ఐఎ అధికారులు తరలించారు. గుంటూరుకు చెందిన అబ్దుల్‌ రహీం(49), అబ్దుల్‌ వాహిద్‌(45), షేక్‌ జఫరుల్లాఖాన్‌(49), కర్నూల్‌కు చెందిన అబ్దుల్‌ వారిస్‌(61)ను ఎన్‌ఐఏ అధికారులు గతంలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. వీరు చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. బుధవారం కోర్టు అనుమతులతో ఎన్‌ఐఏ అధికారులు వీరిని మరోసారి కస్టడీకి తీసుకెళ్లారు.


నగరంలో భారీగా పోలీసుల బదిలీలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకూ వివిధ కేటగిరీల్లో 247 మందిని బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం ఉత్తర్వులు చేశారు. వీరిలో మూడేళ్ల పదవీ కాలం ముగిసి, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, డిటెక్టివ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 45 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ తదితర విభాగాల్లో 5-7 ఏళ్లు ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts