logo

పుట్టిన రోజే జల సమాధి

పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది. స్నేహితులతో ఆనందంగా గడిపిన క్షణాలే అంతిమ గడియలుగా మారాయి. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాట్కాన్‌ చెరువులో ఈత కొట్టేందుకు...

Published : 29 Sep 2022 03:38 IST

చెరువులో ఈతకు దిగిన ఘటనలో విద్యార్థి మృతి.. ఇద్దరి గల్లంతు


నీళ్లలో మునిగిపోతున్న విద్యార్థులు

ఈనాడు- హైదరాబాద్‌, కీసర, న్యూస్‌టుడే: పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది. స్నేహితులతో ఆనందంగా గడిపిన క్షణాలే అంతిమ గడియలుగా మారాయి. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాట్కాన్‌ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట్‌కు చెందిన హుబేద్‌(18), అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన బాలాజీ(18), హయత్‌నగర్‌కు చెందిన హరిహరన్‌(18) మీర్‌పేట్‌లోని తీగల కృష్ణారెడ్డి కళాశాలలో డిప్ల్లొమా మూడో సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హుబేద్‌, హరిహరన్‌ పుట్టిన రోజు కావడంతో బాలాజీతో పాటు ముగ్గురి విద్యార్థినులు సహా మొత్తం తొమ్మిది మంది కీసర మండలం చీర్యాలలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వచ్చారు. దర్శనానంతరం పక్కనే ఉన్న నాట్కాన్‌ చెరువు దగ్గరకు వచ్చారు. అందులో సరదాగా ఈత కొట్టేందుకు మొదట హుబేద్‌, బాలాజీ దిగారు. ఇద్దరికీ ఈత వచ్చు. ఆ తర్వాత వెనకాల హరిహరన్‌ దిగాడు. ఇతనికి ఈత రాదు. ముగ్గురు నీటిలో కొద్దిసేపు సరదాగా కనిపించినా.. ఈత కొడుతూ బాలాజీ ఒక్కసారిగా చేతులు పైకెత్తి మునిగిపోతున్నట్లు కనిపించాడు. హుబేద్‌ అతనికేమైందో తెలుసుకునేందుకు దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ఇద్దరూ మునిగిపోయారు. మరోవైపు హరిహరన్‌ సైతం ఒక్కసారిగా చేతులు పైకెత్తుతూ కేకలు వేస్తూ కొద్దిసేపటికి అతనూ నీటిలో మునిగిపోయాడు.


మృతిచెందిన హరిహరన్‌

అంతా రెండు నిమిషాల్లోనే..
విద్యార్థులు నీటిలోకి దిగడం.. ఒకరివెనక ఒకరు మునిగిపోవడం అంతా రెండు నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ ఘటనను ఓ విద్యార్థి తన ఫోన్‌లో చిత్రీకరించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు విద్యార్థుల్ని వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లను పిలిపించారు. హరిహరన్‌ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన హుబేద్‌, బాలాజీ కోసం గాలిస్తున్నారు. చెరువులో ఇటీవల వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారు. వాటి మధ్య విద్యార్థులు చిక్కుకోవడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.


గల్లంతైన హుబేద్‌,                 బాలాజీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని