logo

గుండె గోస విందాం

ఏటా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి నగరంలో 10 వేల వరకు బైపాస్‌ శస్త్ర చికిత్సలు చేస్తుంటారనేది అంచనా. హృద్రోగ సమస్యలతో వైద్యుల వద్దకు వచ్చే వారిలో 30-39 ఏళ్ల వారే 56 శాతం మంది వరకు ఉంటున్నారని ఓ ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది.

Published : 29 Sep 2022 03:38 IST

యువతలో పెరుగుతున్న సమస్యలు
నేడు ప్రపంచ హృద్రోగ దినం
ఈనాడు, హైదరాబాద్‌

* గాంధీ ఆసుపత్రిలోని క్యాథ్‌ల్యాబ్‌లో గత 3-4 నెలల్లో రోగులకు 504 రకాల గుండెకు సంబంధించి చికిత్సలు అందించారు.

* ఉస్మానియాలో హృద్రోగంతో వచ్చే వారికి నెలకు 100-150 వరకు యాంజియోగ్రామ్‌లు, యాంజియోప్లాస్టీలు లేదంటే స్టంట్లు వేస్తుంటారు.

ఏటా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి నగరంలో 10 వేల వరకు బైపాస్‌ శస్త్ర చికిత్సలు చేస్తుంటారనేది అంచనా. హృద్రోగ సమస్యలతో వైద్యుల వద్దకు వచ్చే వారిలో 30-39 ఏళ్ల వారే 56 శాతం మంది వరకు ఉంటున్నారని ఓ ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. హైదరాబాద్‌ లాంటి మహానగరాల నుంచే గుండె సమస్యలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు ఉంటున్నాయని పేర్కొంది. గత మూడు నెలల్లో ఇలాంటి వారి సంఖ్య మహానగరాల్లో 200 శాతం పెరిగినట్లు వివరించింది. ఇందులో 75 శాతం మంది పురుషులు ఉంటే.. 25 శాతం మంది మహిళలు అని తెలిపింది. హృద్రోగ సమస్యలు ఎంతలా పెరుగుతున్నాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గురువారం ప్రపంచ హృద్రోగ దినం సందర్భంగా కథనం..

గుండె సమస్యలకు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులు. అధిక ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్స్‌ తినడం, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు లాంటివి పెరిగి ఆఖరికి హృద్రోగ సమస్యలకు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి బయట పడటానికి పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు అవి ఏమిటో చూద్దాం..


బాడీబిల్డింగ్‌ కోసం సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

డా.ప్రణీత్‌, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు, కిమ్స్‌

నగరంలో చాలామంది యువత బాడీ బిల్డింగ్‌ కోసం కసరత్తు చేస్తూ సప్లిమెంట్లు తీసుకుంటారు. ఇందులో ఉండే ఎనబాలిక్‌ స్టిరాయిడ్లు గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇవి ఎక్కువ మోతాదులో దీర్ఘకాలం తీసుకుంటే హానిచేస్తాయి. హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ వర్కౌట్స్‌(హెచ్‌ఐఐటీ) వల్ల గుండె కొట్టుకునే రేటుతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి పెరిగి అది వైఫల్యానికి దారి తీస్తుంది.


9-11 శాతం యువతలో సీవీడీ సమస్యలు

డా.కార్తీక్‌ పాండురంగ్‌ జాదవ్‌,  కన్సల్టెంట్‌ కార్డియాలజిస్టు, అపోలో

యువతలో ఆకస్మిక మరణాలకు గుండె కవాటాల వ్యాధులు(సీవీడీ) ప్రధాన కారణం. 9-11 శాతం యువతలో ఈ సమస్యలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. కొద్ది దూరం నడుస్తుంటే ఆయాసం, ఛాతిలో తరచూ నొప్పి, అలసట, ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు లాంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.


హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి

డా.నాగేందర్‌, సూపరింటెండెంట్‌, ఉస్మానియా ఆసుపత్రి

హృద్రోగ సమస్యలతో వచ్చే వారి సంఖ్య గతంతో పోల్చితే పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది. ఉస్మానియాలో అన్ని రకాల చికిత్సలు ఉచితంగా అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీలో క్లిష్టమైన సర్జరీలు కూడా చేస్తున్నాం. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్‌గా దొరికే ఫలాలు ఎక్కువగా తీసుకోవాలి. 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts