logo

నకిలీ కాల్‌సెంటర్‌ కేరాఫ్‌ కోల్‌కతా

నకిలీ కాల్‌ సెంటర్‌ ముఠాలు అడ్డా మారుస్తున్నాయి. ఇప్పటివరకూ బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీ తదితర రాష్ట్రాలు కేంద్రంగా దందా కొనసాగిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ముఠాలను అరెస్టు చేస్తుండటంతో నేరగాళ్లు తమ మకాం కోల్‌కతాకు, అక్కడి పరిసర జిల్లాలకు మార్చారు.

Published : 29 Sep 2022 03:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ కాల్‌ సెంటర్‌ ముఠాలు అడ్డా మారుస్తున్నాయి. ఇప్పటివరకూ బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీ తదితర రాష్ట్రాలు కేంద్రంగా దందా కొనసాగిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ముఠాలను అరెస్టు చేస్తుండటంతో నేరగాళ్లు తమ మకాం కోల్‌కతాకు, అక్కడి పరిసర జిల్లాలకు మార్చారు. ప్రధానంగా దక్షిణ కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌, టోలిగంజ్‌ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో కాల్‌సెంటర్లు ఏర్పాటయ్యాయి. అక్కడి పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండడం, నకిలీ చిరునామాతో సిమ్‌కార్డులు సులువుగా దొరుకుతుండటంతో అడ్డా అక్కడికి మారినట్లు తెలుస్తోంది. డేటా ప్రొవైడర్ల ద్వారా లక్షల సంఖ్యలో ప్రజల వివరాలు సేకరిస్తున్న నేరగాళ్లు.. కోల్‌కతాలో సులువుగా సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. సిమ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్‌, సహా వ్యక్తి చిరునామా అవసరం లేకుండానే దొరకడంతో దర్యాప్తు సంస్థల్ని సులువుగా ఏమారుస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్పారు. నివాస ప్రాంతాల్లోని అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా వందల సంఖ్యలో కాల్‌సెంటర్లు కొనసాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చిన్న బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఒక బృందం పోలీసులకు పట్టుబడినా ఇతరులు గుర్తింపు మార్చుకుని మోసాలు కొనసాగిస్తున్నారు.

అనుమానం రాకుండా గుట్టుగా
కోల్‌కతా కేంద్రంగా తెలుగువారిని మోసం చేస్తున్న ముఠాలను ఇటీవల రాచకొండ, సైబర్‌బాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం కోల్‌కతా వెళ్లినప్పుడు వారు కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న నివాసాన్ని చూసి దర్యాప్తు అధికారులు విస్తుపోయారు. రెండు పడక గదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారని, కింద కూర్చుని ఎవరికి వారు ఫోన్లు మాట్లాడుతూ కనిపించారని ఓ అధికారి తెలిపారు.

విదేశీయులే లక్ష్యంగా మోసాలు
నకిలీ కాల్‌సెంటర్ల మోసాలు దేశీయంగా ఉండేవి. కోల్‌కతాలోని ముఠాలు ఇప్పుడు విదేశీయుల్ని మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అందులోనూ వయసు మీరిన వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. తాజాగా సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కోల్‌కతాలో ఓ ముఠాను అరెస్టు చేయగా ఈ ముఠా సభ్యులు కేవలం అమెరికన్లను మాత్రమే మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తెలిసింది. సాఫ్ట్‌వేర్‌, యాంటీ వైరస్‌ అప్‌డేట్‌ అంటూ మెయిల్‌ పంపిస్తున్నారు. ఇది నమ్మి సంప్రదించిన అమెరికన్ల నుంచి సర్వీసు ఛార్జి వసూలు చేస్తారు. ఆ తర్వాత ఫోన్‌ ఆపేస్తారు. ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర దేశీయుల్ని మోసం చేసిన కేసులు వెలుగుచూసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని