logo

కాలు పెట్టాలన్నా కష్టమే

మెట్రోరైలులో ప్రయాణికుల సంఖ్య కొవిడ్‌ ముందు స్థాయికి చేరుకున్నా సరైన సౌకర్యాలు అందడం లేదు. స్టేషన్‌ పరిసరాల్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి మెట్రోలో కాలు పెట్టే వరకు నిత్యం పలువురు ప్రయాణికులు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. కొన్ని స్టేషన్లలో ఇప్పటికీ మెట్ల మార్గాలు మూసే ఉంటున్నాయి.

Updated : 29 Sep 2022 10:51 IST

రద్దీకి అనుగుణంగా లేని సర్వీసులు
స్టేషన్లలోనూ అస్తవ్యస్త పరిస్థితులు
అంతంతమాత్రంగా నిర్వహణ..  శ్రద్ధపెట్టని మెట్రోరైలు సంస్థలు


చిక్కడపల్లిలో మూసి ఉన్న ఒకవైపు మెట్ల మార్గం

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలులో ప్రయాణికుల సంఖ్య కొవిడ్‌ ముందు స్థాయికి చేరుకున్నా సరైన సౌకర్యాలు అందడం లేదు. స్టేషన్‌ పరిసరాల్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి మెట్రోలో కాలు పెట్టే వరకు నిత్యం పలువురు ప్రయాణికులు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. కొన్ని స్టేషన్లలో ఇప్పటికీ మెట్ల మార్గాలు మూసే ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. లగేజీతో పెద్దలు నానా అగచాట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిర్వహణ లోపాలే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. అయినా సరే వేగంగా గమ్యస్థానం చేరొచ్చు అని ఎక్కితే సాంకేతికత కారణాలతో మెట్రో ఆగిపోవడం, నిదానంగా నడవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మెట్రో రైలు హైదరాబాద్‌ వాసులకి అందుబాటులోకి వచ్చి ఐదేళ్లు కావొస్తుంది. మెట్ల మార్గం నుంచి ఆపైన ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. స్టేషన్‌ కింద ఇరువైపులా 600 మీటర్ల దూరం వరకు పరిసరాలను హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ సుందరంగా అభివృద్ధి చేసింది. కొవిడ్‌ సమయంలో మెట్రో 169 రోజులు మూతపడటంతో నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. సర్వీసులు తిరిగి ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో సేవలు ప్రయాణికులకు అందడం లేదు. శుభ్రత తగ్గిందనే ఫిర్యాదులు వస్తున్నాయి. మెట్రోలో ప్రయాణం హాయ్‌ అనేది మూణ్నాళ్ల ముచ్చటగా మారింది.

ప్రయాణికులు లేరని..
కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు పలు స్టేషన్లలో అన్ని మార్గాలను తెరవడం లేదు. చిక్కడపల్లి స్టేషన్‌లో ఒకవైపు మెట్లమార్గం ఎప్పుడు చూసినా మూసే ఉంటుంది. తెరవాలని ప్రయాణికులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రసూల్‌పురాలో ఇటీవల ఎస్కలేటర్‌ పనిచేయలేదు.  
* స్టేషన్లలో మరుగుదొడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. దుర్గంధంతో అధ్వానంగా ఉంటున్నాయి.

నగరంలో మెట్రో స్వరూపం
కారిడార్లు: 3
స్టేషన్లు: 57
అందుబాటులోకి వచ్చిన మార్గం: 69 కి.మీ.

దెబ్బతిన్న కాలిబాటలు
కాలిబాటల్లో చాలాచోట్ల టైల్స్‌ పగలిపోయాయి. ఎగుడు దిగుడుగా ప్రమాదకరంగా మారాయి. ఉప్పల్‌, నాగోల్‌లో కాలిబాటలు దెబ్బతిన్నాయి. నియంత్రణ లేక హబ్సిగూడ స్టేషన్‌ కాలిబాటల్లోనే వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రవేశ మార్గాలకు అడ్డుగా నిలుపుతున్నారు.  
* పచ్చదనంతో కళకళలాడాల్సిన స్టేషన్‌ కింద ఉన్న డివైడర్‌ కాస్త మట్టికుప్పలు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. రాయదుర్గం స్టేషన్‌తో సహా పలుచోట్ల ఇదే పరిస్థితి.
* చీకటి పడితే పలు స్టేషన్ల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మియాపూర్‌ స్టేషన్‌ పరిసరాలు, బేగంపేట పరిసరాల్లో పది గంటల తర్వాత మెట్రో దిగి బయటికి వచ్చే ప్రయాణికులు భయపడుతున్నారు. పోలీసుల నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.

పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం..
స్టేషన్‌ పరిసరాల్లో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుశాఖ దృష్టికి తీసుకెళ్లాం. కాలిబాట ప్రాంతాల్లో మా సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా.. కవర్లలో చెత్తతీసుకొచ్చి వేస్తున్నారు. మెట్రోలో సౌకర్యాల మెరుగునకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం.

- ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్‌ మెట్రోరైలు


అడుగు పెట్టలేక..

ప్రస్తుతం మెట్రోలో రద్దీ బాగా పెరిగింది. నాలుగు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా అడుగు తీసి అడుగు వేయలేనంతగా రద్దీ ఉంటుంది. మరిన్ని సర్వీసులు పెంచాలని, మూడు నిమిషాలకు ఒకటి నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. వారం క్రితం కారిడార్‌-1లో, కారిడార్‌-3లో సాంకేతికత సమస్యలతో 20 నిమిషాలు సేవలకు అంతరాయం కల్గింది.


పార్కింగ్‌ సమస్య..


హబ్సిగూడలో కాలిబాటలోనే వాహనాల పార్కింగ్‌  

నగరంలో కొన్ని స్టేషన్లలో మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంది. మిగిలిన స్టేషన్లలో ఎక్కువగా రహదారులపైనే వాహనాలు నిలుపుతున్నారు. పెయిడ్‌ పార్కింగ్‌ కావడంతో దీన్నుంచి తప్పించుకునేందుకు  ఎక్కడపడితే అక్కడ వాహనాలను  నిలుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని