Harish Rao: దిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలు: మంత్రి హరీశ్‌ ఎద్దేవా

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను దిల్లీలో ప్రశంసిస్తూ గల్లీలో విమర్శలు చేస్తున్న కేంద్రమంత్రులు.. దమ్ముంటే రాష్ట్రానికి నిధులిచ్చి

Updated : 29 Sep 2022 15:11 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను దిల్లీలో ప్రశంసిస్తూ గల్లీలో విమర్శలు చేస్తున్న కేంద్రమంత్రులు.. దమ్ముంటే రాష్ట్రానికి నిధులిచ్చి వాటా గురించి మాట్లాడాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓ వైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు ప్రభుత్వ పనితీరు బాగోలేదంటూ రాజకీయ విమర్శలు చేస్తున్నారని భాజపా నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 

ఇప్పటికే తెలంగాణకు చెందిన నాలుగు పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని.. మిగిలిన ఉచిత విద్యుత్‌, రైతుబంధు కూడా కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేయాలని హరీశ్‌ వ్యాఖ్యానించారు. రెండురోజులకోసారి రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు.. తెలంగాణ పథకాలను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి రూ.5,300కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం నివేదిక, మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆక్షేపించారు. 

సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. జల్ జీవన్ మిషన్‌కు బూస్ట్‌లా పనిచేస్తోందంటూ ఇచ్చిన ప్రశంసలు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. సమస్యలకు తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తున్న నాయకుడు కేసీఆర్ అని హరీశ్‌ కొనియాడారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న నాయకులు ఎక్కడైనా నీళ్లు, విద్యుత్‌ గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అవార్డుల పంటతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అవార్డులే కాకుండా రాష్ట్రానికి నిధులూ ఇవ్వాలని కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని