logo

ఐఐటీయన్ల... అ‘పూర్వ’ ప్రయత్నం!

కళాశాలల్లో చదువుకొని బయటకు వచ్చిన వారు వివిధ రంగాల్లో రాణిస్తుంటారు. పనిచేసే చోట తమదైన ముద్ర వేసుకొని ముందుకు సాగుతుంటారు. కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటారు.

Published : 30 Sep 2022 03:12 IST

పది మంది ప్రభావశీలురను గుర్తించేలా ప్రణాళిక
భవిష్యత్‌ నాయకులను ప్రోత్సహించేలా కార్యాచరణ

ఈనాడు, సంగారెడ్డి: కళాశాలల్లో చదువుకొని బయటకు వచ్చిన వారు వివిధ రంగాల్లో రాణిస్తుంటారు. పనిచేసే చోట తమదైన ముద్ర వేసుకొని ముందుకు సాగుతుంటారు. కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి మరింత ప్రోత్సహించేలా ఐఐటీ హైదరాబాద్‌ పూర్వ విద్యార్థుల బృందం సరికొత్త ప్రయత్నం ఆరంభించింది. గత పదేళ్లలో ఐఐటీలో చదువుకొని ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న పది మంది అత్యంత ప్రభావ శీలురను గుర్తించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వీరికి అవార్డులు ఇవ్వడంతో పాటు భవిష్యత్తు లీడర్లుగా ఎదిగేలా అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశం.

పదేళ్లలో 5వేల పైచిలుకు..: ఐఐటీ హైదరాబాద్‌ 2008లో ప్రారంభమైంది. 2012లో తొలిసారిగా ఇక్కడి నుంచి బీటెక్‌ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. అలా ఇప్పటి వరకు పది పర్యాయాలు స్నాతకోత్సవాలు నిర్వహించారు. దాదాపు 5వేల పైచిలుకు విద్యార్థులు పట్టాలు అందుకొని వివిధ చోట్ల పనిచేస్తున్నారు. కొందరు సొంతంగా అంకుర సంస్థలను స్థాపించారు. మరికొందరు బోధనా వృత్తిని ఎంచుకున్నారు. ఇంకొందరు ప్రఖ్యాత సంస్థల్లో మంచి హోదాల్లో విధులు నిర్వర్తిస్తుండగా... కొందరు పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. వీరి నుంచి అత్యంత ప్రతిభ చూపుతూ.. సమాజంలో మార్పు దిశగా అడుగులు వేస్తున్న పది మందిని గుర్తించనున్నారు. ఇందుకోసం పూర్వ విద్యార్థుల నుంచి వారికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తులూ తీసుకుంటున్నారు.

తొమ్మిది మంది సభ్యులతో సెలక్షన్‌ కమిటీ..

భిన్న రంగాల్లో కృషి చేస్తున్న పూర్వ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి.. తొలి పది ప్రభావశీలురను గుర్తించేందుకు సెలక్షన్‌ కమిటీని నియమించారు. ఇందులో మొత్తం తొమ్మిది మంది సభ్యులున్నారు. జపాన్‌కు చెందిన ఆచార్య జున్‌ మురాయి, తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకులు అజయ్‌ చౌధురి తదితరులకు కమిటీలో చోటు కల్పించారు. ఐఐటీ పూర్వ డైరెక్టర్‌ ఆచార్య యూబీ దేశాయ్‌, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఆచార్యులు ముద్రికా, కొటారో కటోకా, ఎం.పి.గణేష్‌ సలహాదారులుగా ఉన్నారు.


ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపే లక్ష్యం
- ఆర్‌.సాయిచంద్ర, అధ్యక్షుడు, పూర్వవిద్యార్థుల సంఘం

పది అత్యంత ప్రభావశీలురను ఎంపిక చేసి.. ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపడమే ప్రధాన లక్ష్యం. వారి ప్రయాణం ఎలా సాగుతోంది? ఇప్పటి వరకు ఎలాంటి విజయాలు సాధించారు? తదితర పూర్తి సమాచారాన్ని అందరితోనూ పంచుకోనున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని