logo

రక్తహీనత.. అధిగమిస్తేనే భవిత!

జిల్లాలో మహిళలు, చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు మహిళా, శిశుసంక్షేమ జిల్లా అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా, ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఐరన్‌ లోపంతో

Published : 30 Sep 2022 03:12 IST

అధికారులు మరింత దృష్టి సారిస్తే మేలు


గర్భిణి బరువు చూస్తూ..

న్యూస్‌టుడే, వికారాబాద్‌: జిల్లాలో మహిళలు, చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు మహిళా, శిశుసంక్షేమ జిల్లా అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా, ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఐరన్‌ లోపంతో చాలా మంది గర్భిణులు, బాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. దీనివల్లే ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు కాన్పు సమయంలో 12 మంది మృతి చెందారని సమాచారం.  

వికారాబాద్‌, మర్పల్లి, పరిగి, తాండూరు, కొడంగల్‌ ప్రాజెక్టు పరిధిలో 1,106 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 8,701, బాలింతలు 6,209, 0-6 ఏళ్ల పిల్లలు 56,900 మంది నమోదయ్యారు. వీరికి ఆరోగ్యలక్ష్మి ద్వారా నిత్యం ఉదయం 200 మి.లీ పాలు, మధ్యాహ్నం గుడ్డుతో భోజనం వడ్డిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం పొట్లాలు ఇస్తున్నారు.

ప్రస్తుతం ఇలా: జిల్లాలోని 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 8,701 మంది గర్భిణులు తమ పేర్లు నమోదు చేసుకుని, హెచ్‌బీ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,470 మందికి రక్తహీనత ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రసవ సమయంలో 10-11 శాతం హెచ్‌బీకి వచ్చేలా ఏఎన్‌ఎంలు చూడాలి. వీరు ఐరన్‌ మాత్రలు ఇస్తున్నా, ఎంత వరకు వినియోగిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

భోజనానికి రూ.21 ఖర్చు..: ప్రభుత్వం ఒక్క పూట భోజనానికి రూ.21 వరకు ఖర్చు చేస్తోంది. జిల్లాలో 14,910 మంది కేంద్రాల్లో నమోదై ఉన్నారు. వీరిలో 9,600 మంది వరకు కేంద్రాల్లో భోజనం చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.3 లక్షలు వెచ్చిస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇటీవలే రాష్ట్రీయ బాల స్వాస్థ్య సురక్ష(ఆర్‌బీఎస్‌కే)లో 18 ఏళ్లలోపు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం మొదలైంది.  


ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి
శాంతప్ప, చిన్న పిల్లల వైద్య నిపుణలు, ప్రభుత్వ ఆస్పత్రి, వికారాబాద్‌

పోషకాహారంలో లభించే ఇనుము ముఖ్యంగా మన శరీరంలో హిమోగ్లోబిన్‌ తయారీలో కీలకపాత్ర పోషిస్తుంది. మెదడు పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి, కండరాల పనితీరుకు ఇనుము అవసరం. ఇది లేకుంటే రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. ముందునుంచే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని