logo

ఆర్థిక అవరోధం.. అభివృద్ధికి ఆటంకం

రాజధాని నగరంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఆదిలోనే నిలిచిపోయాయి. ఇందులో కొన్ని ప్రారంభించిన తర్వాత ఆగిపోతే మరికొన్ని అసలు ప్రారంభమే కాలేదు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) రెండు మూడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Updated : 30 Sep 2022 04:31 IST

రాజధానిలో పురోగతి లేని కీలక ప్రాజెక్టులు


కేశవాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించాల్సిన ప్రదేశం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని నగరంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఆదిలోనే నిలిచిపోయాయి. ఇందులో కొన్ని ప్రారంభించిన తర్వాత ఆగిపోతే మరికొన్ని అసలు ప్రారంభమే కాలేదు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) రెండు మూడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పూర్తిస్థాయిలో నిధులు సమకూరకపోవడంతో ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే అవస్థలు పడుతోంది. మరో వైపు రుణాలు సమకూరక కీలకమైన నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదు. నిధులు కేటాయిస్తేనే పనులు చేపడతామని అప్పటి వరకు తాము ఏమి చేయలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థికపరమైన సమస్యల వల్ల సర్కార్‌ నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది.


జలాశయం.. ఆలస్యం

నగరానికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేశవాపురం దగ్గర అయిదు టీఎంసీల సామర్థ్యం గల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించాలని తలపెట్టారు. గుత్తేదారు సంస్థకు కూడా పనులు అప్పగించారు. భూ సేకరణ కూడా జరిగింది. నిధులు పూర్తిగా లేకపోవడంతో కొన్ని నెలలుగా పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.

అంచనా వ్యయం  రూ.7200  కోట్లు


లక్ష్యం 158 కి.మీ. .. పూర్తయింది 18 కి.మీ.

జలమండలి ఆధ్వర్యంలో బాహ్యవలయ రహదారి చుట్టూ 158 కి.మీ. మేర రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ప్రాజెక్టుకు రెండేళ్ల కిందటే ప్రారంభించారు. దీనివల్ల నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా గోదావరి, కృష్ణా నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ముత్తంగి నుంచి కోకాపేట వరకు 18 కిలో మీటర్ల మేర మాత్రమే పైపులైను నిర్మించారు. నిధులు లేక పనులు వేగంగా జరగడం లేదు.

అంచనా వ్యయం రూ.3600 కోట్లు


సుందరీకరణ కాదు.. జీతాలకే కష్టం

నగర పరిధిలో 55 కిలో మీటర్ల మేర ప్రవహించే మూసీ నదిని సుందరీకరించాలని మూడేళ్ల కిందటే సర్కార్‌ నిర్ణయించింది. దీనికి మూసీ అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేసింది. నిధులను మంజూరు చేయక ప్రాథమిక దశలో చేపట్టాల్సిన సర్వే పనులూ మొదలుకాలేదు. సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి నెలానెలా జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

అంచనా వ్యయం రూ.3500 కోట్లు


అన్నింటా అంతే..

మూసీ మీద 15 చోట్ల వంతెనలను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ తలపెట్టింది. దీనికి రూ.550 కోట్లు అవుతుందని అంచనా వేశారు. టెండర్ల దశ దాటలేదు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద ఇప్పటికే రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.2500 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నిధుల కొరత వల్ల కొన్ని నిర్మాణం పనులు నెమ్మదించాయి. బల్దియా అధీనంలోని నాలాల విస్తరణ, బాక్సు నాలాల నిర్మాణం, కాలనీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల నిర్వహణలాంటి పనులకు సంబంధించి రూ.400 కోట్ల మేర బకాయిలు ఉండటంతో గుత్తేదారులు పనులను నిలిపివేశారు. ఇవే కాకుండా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మెట్రో విస్తరణకు సైతం నిధులు కొరత అడ్డంకిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని