logo

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు నాలుగు ఈలు

నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాల వల్ల జటిలంగా మారుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి హైదరాబాద్‌ పోలీసులు నాలుగు ‘ఈ’ల విధానాన్ని అవలంబించనున్నారు. రాకపోకలు సాఫీగా సాగేలా ‘ట్రాఫిక్‌ కార్యాచరణ ప్రణాళిక’ను సిద్ధం చేశారు.

Published : 30 Sep 2022 04:02 IST

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కార్యాచరణ ప్రణాళిక
వివరాలు వెల్లడించిన నగర సీపీ సీవీ ఆనంద్‌

లోగోతో ఆనంద్‌, రంగనాథ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాల వల్ల జటిలంగా మారుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి హైదరాబాద్‌ పోలీసులు నాలుగు ‘ఈ’ల విధానాన్ని అవలంబించనున్నారు. రాకపోకలు సాఫీగా సాగేలా ‘ట్రాఫిక్‌ కార్యాచరణ ప్రణాళిక’ను సిద్ధం చేశారు.

వివరాలను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌తో కలిసి నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ గురువారం విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుత లోగో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించింది కావడంతో కొత్త లోగోను విడుదల చేశారు


ఈ-1 (ఆచరణ)

* కేవలం చలానాలపైనే దృష్టిపెట్టకుండా ట్రాఫిక్‌ క్రమశిక్షణ పెరిగేలా చూస్తాం.

* నిబంధనల అమలు, ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపడతాం.

* వాహనదారులు సిగ్నళ్ల వద్ద జీబ్రాక్రాసింగ్‌లు దాటకుండా అవగాహన కల్పిస్తాం.  


ఈ-2(ఇంజినీరింగ్‌)

* పెద్ద జంక్షన్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్రీ లెఫ్ట్‌లు పెడతాం.

* రద్దీ సమయాల్లో ‘రివర్సబుల్‌ లేన్‌’(ఎడమ వైపు నుంచి వెళ్లే వాహనాలకు కుడివైపు రోడ్డుపై కొంత దారివ్వడం) ఇస్తాం. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నల్లకుంట, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో వన్‌వే ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నాం. యూటర్న్‌లను పెంచుతాం.


ఈ-3 (ఎడ్యుకేషన్‌)

* కొత్తగా సామాజిక మాధ్యమ విభాగాన్ని ఏర్పాటు చేసి యువతకు  ట్రాఫిక్‌ నిబంధనలపై చిత్రాలతో అవగాహన కల్పిస్తాం.


ఈ-4(బలోపేతం)

* బాగా పనిచేసే ట్రాఫిక్‌ పోలీసులకు సౌకర్యాలు పెంచుతాం. బదిలీల్లో భాగంగా 2005, 2010 బ్యాచ్‌ సీఐలకు పోస్టింగులిచ్చాం. కొత్తగా 40 మంది ఎస్సైలను నియమించాం.

* సిబ్బందిలేని 150 కూడళ్లలో 100 మంది హోంగార్డులను నియమిస్తాం. సాయుధ విభాగంలోని 100 మంది మహిళా కానిస్టేబుళ్ల సేవల్ని వినియోగించుకుంటాం.


‘ఆపరేషన్‌ రోప్‌’

ఆక్రమణలు, అడ్డగోలుగా నిలిపిన వాహనాల తొలగింపు దీని ప్రధాన లక్ష్యం. ఇందుకు ట్రాఫిక్‌ స్టేషన్‌కు రెండు చొప్పున క్రేన్లు కేటాయిస్తారు. నో పార్కింగ్‌లో నిలిపిన వాహనానికి క్లాంప్‌ పెట్టి దానిపై పోలీస్‌ అధికారి ఫోన్‌ నంబరు ప్రదర్శించడం.

వ్యాపార సముదాయాల్లో పార్కింగ్‌ కల్పించేలా నిర్వాహకులకు అవగాహన.

వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు రోడ్లపైకి రాకుండా సరిహద్దులు నిర్ణయించడం. ప్రజాప్రతినిధులతో కలిసి వీధి వ్యాపారులకు సమస్యను వివరించి సహకరించేలా చేయడం.

ఆర్టీసీ అధికారులతో చర్చించి ఇబ్బందికర బస్టాపుల్ని మారుస్తాం. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక స్టాండ్ల కేటాయిస్తాం.


కారులో వెనుక కూర్చున్నా బెల్టు

కేంద్ర రవాణా శాఖ ఆదేశాల నేపథ్యంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న వారూ సీటు బెల్టు పెట్టుకోవాలనే నిబంధనను త్వరలో అమలు చేస్తాం.


క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక
అధికారులకు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సమస్యలపై క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుర్తించి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతపై కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ విభాగం అధికారులతో కమిషనర్‌ గురువారం సమావేశమయ్యారు. జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల వెంట సూచికల ఏర్పాటు, ఓఆర్‌ఆర్‌ వెంట ట్రామా కేంద్రాల నిర్మాణం, లింకు రోడ్ల దగ్గర ట్రాఫిక్‌ వాలంటీర్ల సేవల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలన్నారు. వర్షాల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే శాంతి భద్రతల విభాగం సహకారం తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని