Hyderabad: గీత దాటితే రూ.100 కట్టాల్సిందే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కొత్త నిబంధనలు

 ‘రోప్‌’ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు.

Published : 01 Oct 2022 02:20 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు దఫాలుగా ట్రాఫిక్‌ విభాగం అధికారులతో సమావేశమైన సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ‘రోప్‌’ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. 

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధించాలని నిర్ణయించారు. కొత్త నిబంధనలు అక్టోబరు 3 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని ట్రాఫిక్‌ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. వాహనదారులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

భారీగా పెరిగిన వాహనాల వినియోగం..

హైదరాబాద్‌ మహానగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొవిడ్‌ కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం  ఎక్కువైంది. నగరంలో రహదారులపై  ప్రతిరోజు దాదాపు 80లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది. 2019తో పోలిస్తే వాహనాలు ఏకంగా 18శాతం పెరిగాయి. ద్విచక్రవాహనాలే దాదాపు 56లక్షల వరకు ఉన్నాయి. సుమారు 14లక్షల కార్లు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే కొన్ని మార్గాల్లో కిలోమీటరు ప్రయాణానికి 10 నిమిషాల సమయం పడుతోంది. ఒక్కోసారి గంటల తరబడి రహదారులపైనే వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు సైతం కొన్ని సందర్భాల్లో చేతులెత్తేస్తున్నారు. ఫుట్ పాత్‌ల ఆక్రమణ, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచడమే ట్రాఫిక్ సమస్యలకు కారణమని ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. పలు సమీక్షల తర్వాత సీవీ ఆనంద్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 

పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించాల్సిందే..

ఆర్టీసీ బస్సులు బస్ బే లలోనే నిలిపేటట్లుగా, ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సీవీ ఆనంద్ సూచించారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు.. రహదారులు, ఫుట్ పాత్ ల పైకి రాకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించనున్నారు. జీఓ 168 ప్రకారం బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, విద్యా సంస్థల్లో 30శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. హోటళ్లు, లాడ్జ్ లు, వాణిజ్య భవనాల్లో 40శాతం, షాపింగ్ మాల్స్‌, మల్టిప్లెక్స్‌లలో 60శాతం పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయని భవనాలపై చర్యలు తీసుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ముందుకు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని