logo

పుడమి తల్లికి.. పుట్టెడు దుఃఖం

రోజురోజుకూ సాగు నేలలు విషతుల్యంగా మారుతున్నాయి. మానవ మనుగడకు ఆధారమైన భూతల్లిపై విచ్చలవిడిగా రసాయనాల వాడకం పెరిగిపోయి నిస్సారమవుతోంది. జిల్లాలో 80 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4.86 లక్షల ఎకరాల్లో

Published : 01 Oct 2022 03:25 IST

విచ్చలవిడిగా రసాయనాల వాడకం

న్యూస్‌టుడే, వికారాబాద్‌: రోజురోజుకూ సాగు నేలలు విషతుల్యంగా మారుతున్నాయి. మానవ మనుగడకు ఆధారమైన భూతల్లిపై విచ్చలవిడిగా రసాయనాల వాడకం పెరిగిపోయి నిస్సారమవుతోంది. జిల్లాలో 80 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4.86 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా, వీటిలో పత్తి, కంది 3.2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు 150 కిలోల డీఏపీ, వంద కిలోల యూరియా వాడుతారు. వీటికి చీడపీడల బెడద అధికం. పంటలు పూత దశకు వచ్చాక పత్తికి ఐదారు, కందికి మూడు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం తప్పనిసరి.
పొంచి ఉన్న ప్రమాదం..: పంటలకు యూరియా తీసుకుంటే.. ఆ బస్తాలో 46 శాతం మాత్రమే యూరియా ఉంటుంది. మిగతా 54శాతం సున్నపు గుళికల్లాంటి మూలపదార్థం ఉంటుంది. దీనిపై యూరియా పూత(కోటింగ్‌) పూస్తారు. దీనిని నేలపై వేయడంతో 54 శాతం ఉన్న మూల పదార్థం పేరుకుపోయి భూసారం తగ్గుతుంది. అంతేకాకుండా సహజమైన బ్యాక్టీరియా, వానపాములు నశించిపోతాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్నదాతలు కృషి చేయాలి.  

సేంద్రియ సాగు: సేంద్రియ ఎరువులపై సరైన ప్రచారం చేయకపోవడంతో రైతులు వీటిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా రసాయన ఎరువులనే వాడుతున్నారు. ఏటా పెట్టుబడులు పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఆమ్లక్షార లక్షణాలు పెరిగి భూసారం తగ్గి సరైన దిగుబడులు రావడంలేదు. అంతేకాకుండా ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయి. దీని నుంచి బయట పడాలంటే సేంద్రియ ఎరువుల వినియోగమే మార్గం. ఈ  విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తేనే ప్రయోజనముంటుంది.


ప్రత్యేక శిక్షణతో ప్రయోజనం..: మోహన్‌రెడ్డి, రైతు, వికారాబాద్‌

ఏటా సేంద్రియ ఎరువులతోనే 10 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నా. ఈ విధానంలో ఎరువుల తయారీపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అందుబాటులో లభించే రసాయన ఎరువులు, మందులపై ఆధారపడుతున్నారు. వీటి వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలి.


అవగాహన కల్పిస్తున్నాం: గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి  

వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5,99,800 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా, 74,683 మెట్రిక్‌ టన్నుల రసాయన ఎరువుల వినియోగించారు. అయితే భూములు సారాన్ని కోల్పోకుండా ఉండేందుకు రైతులు సేంద్రియ ఎరువులు వాడాలని అవగాహన కల్పిస్తున్నాం. దీని వల్ల భూమిలో పోషక విలువలు పెరుగుతాయి. ఏటా ప్రతి రైతు భూమి సారాన్ని పరీక్షించుకోవాలి. ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని