logo

స్వచ్ఛ పథం... శివారు పట్టణం

వ్యర్థాల నిర్వహణలో సరికొత్త మార్గం.. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం.. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ.. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా వినూత్న మార్గాలతో శివారు పట్టణాలు స్వచ్ఛంగా నిలుస్తున్నాయి. జాతీయ స్థాయిలో 2022 సంవత్సరానికి బడంగ్‌పేట కార్పొరేషన్‌, ఆదిభట్ల, కొంపల్లి,

Published : 01 Oct 2022 03:11 IST

వినూత్న మార్గాలతో జాతీయ స్థాయిలో అవార్డు సాధన

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలు

-ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, బాలాపూర్‌, తుర్కయంజాల్‌,ఘట్‌కేసర్‌, పేట్‌బషీరాబాద్‌, ఆదిభట్ల 

వ్యర్థాల నిర్వహణలో సరికొత్త మార్గం.. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం.. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ.. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా వినూత్న మార్గాలతో శివారు పట్టణాలు స్వచ్ఛంగా నిలుస్తున్నాయి. జాతీయ స్థాయిలో 2022 సంవత్సరానికి బడంగ్‌పేట కార్పొరేషన్‌, ఆదిభట్ల, కొంపల్లి, ఘట్‌కేసర్‌, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలు స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పట్టణాలల్లో అనుసరిస్తున్న విధానాలు.. మరింతగా మెరుగుపడాల్సిన పరిస్థితులపై పరిశీలన కథనం..


డబుల్‌ ప్లస్‌ ఓడీఎఫ్‌.. తుర్కయంజాల్‌

తుర్కయాంజాల్‌ సేంద్రియ ఎరువు తయారీ

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా డబుల్‌ ప్లస్‌ ఓడీఎఫ్‌ మున్సిపాలిటీగా తుర్కయంజాల్‌ నిలిచింది. కూరగాయల వ్యర్థాలు(తడిచెత్త)తో సేంద్రియ ఎరువు తయారీ, ఇంటింటా చెత్త సేకరణ, పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి, మాసాబ్‌చెరువు సుందరీకరణ, 40కిపైగా ప్రజాశౌచాలయాలు వంటి అంశాల్లో ఘనత సాధించింది.

మెరుగుపడాల్సినవి..అంతర్గత మురుగునీటి వ్యవస్థకు అవుట్‌లెట్‌ లేకపోవడం, మురుగునీటి శుద్ధి చేయాలి. నిర్మాణంలో ఉన్న డీఆర్సీ కేంద్రం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి.


చెత్త సేకరణకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌.. కొంపల్లి

కొంపల్లి మున్సిపల్‌ కార్యాలయం

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 91 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్‌ ఉంది. 46 ఆటోల్లో ఇళ్ల నుంచి ఎప్పటికప్పుడు చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి నిత్యం రెండు టన్నుల తడి చెత్త నుంచి ఎరువు తయారు చేస్తారు. చెత్త సేకరణకు ప్రత్యేకంగా 14420 కాల్‌ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవలే మున్సిపాలిటీకి ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌ ధ్రువీకరణ దక్కింది.

మెరుగుపడాల్సినవి.

*రహదారులపై చెత్త పేరుకుంటోంది

*భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలి

* తాగునీటి లీకేజీలు నియంత్రించాలి


నిర్వహణలో ఘనం.. బడంగ్‌పేట

నగరదీపికలతో సేంద్రియ ఎరువుపై అవగాహన కల్పిస్తున్న మేయర్‌ పారిజాత, కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి

పారిశుద్ధ్య నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తుండటంతో బడంగ్‌పేట కార్పొరేషన్‌కు స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డు దక్కింది. కార్పొరేషన్‌ పరిధిలోని 32 డివిజన్లలో 36 వేలకుపైగా ఇళ్లున్నాయి. ఆయా ప్రాంతాల్లో 8 ఆటోలు, 4 ట్రాక్టర్లు, 64 ప్రైవేటు వాహనాలతో చెత్త సేకరణ, తరలింపు జరుగుతోంది. 62 మంది నగర దీపికలు రోజు ఇంటింటికి వెళ్తూ తడి, పొడి చెత్తను వేరు చేయాలని, స్వచ్ఛ రిక్షాల్లోనే వేయాలని ప్రచారం చేస్తున్నారు. వేయి ఇళ్లలో కంపోస్టు ఎరువును చేసుకుని మొక్కలు పెంచుకుంటున్నారు. పట్టణ ప్రగతి టాయిలెట్స్‌ మానిటరింగ్‌ యాప్‌ ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో శౌచాలయాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉంటే వెంటనే శుభ్రం చేయిస్తున్నారు. చెత్తను తరలించడంతో వచ్చే ఖర్చును తగ్గించుకునేందుకు ఇన్సినరేటర్‌ యంత్రంతో బూడిదగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.  

మెరుగుపడాల్సినవి.

* తడి, పొడి చెత్త వేర్వేరుగా సమగ్రంగా చేయడం

* డ్రైనేజీల నిర్మాణం

* అవుట్‌లెట్‌ల సమస్య

* నిత్యం ఇంటింటా చెత్త సేకరణ


పచ్చదనం+ పరిశుభ్రత= ఆదిభట్ల

పచ్చదనం, పరిశుభ్రతకు ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రాధాన్యతనిస్తోంది. బహిరంగంగా చెత్త వేస్తే చలాన్లు విధిస్తుంటారు. ప్రధాన రోడ్ల నుంచి వార్డుల్లోకి(ఊళ్లకు వెళ్లేదారి) ఎప్పటికప్పుడు పచ్చదనం ఉండేలా చూస్తున్నారు. ఈ ఏడాది 1.15 లక్షల మొక్కల లక్ష్యానికి 1.16 లక్షల మొక్కలు నాటారు.

మెరుగుపడాల్సినవి.

* తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా తయారు చేయాలిబీ డీఆర్‌సీ సెంటర్‌ ఉపయోగించుకోవాలి

* కొంగరకలాన్‌, మంగళపల్లి, బొంగుళూర్‌ సమీపంలో ప్రధాన రహదారులను మెరుగుపరచాలి  


ప్లాస్టిక్‌ నిషేధంలో ముందంజలో ఘట్‌కేసర్‌

చెత్త సేకరణ, ప్లాస్టిక్‌ నిషేధం, బహిరంగ మల విసర్జన నిషేధం తదితర అంశాలలో రెండోసారి ఘట్‌కేసర్‌ పురపాలికకు అవార్డు దక్కింది. పురపాలికలో ఉదయం వేళ ఛైర్‌పర్సన్‌ పావనీయాదవ్‌, కమిషనర్‌ ఎన్‌.వసంత నిత్యం పాదయాత్ర చేస్తుంటారు. పాటలతో చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం తడి చెత్త 13 టన్నులు, పొడి చెత్త 10.5 టన్నులు, ఇతరత్రా 1.5 టన్నుల మేర వస్తోంది. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. కంపోస్టు యార్డులు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. పట్టణంలోని 18 వార్డుల్లో ప్లాస్టిక్‌ వినియోగించకుండా స్టీల్‌ వాడాలని అవగాహన కల్పిస్తున్నారు.  

మెరుగుపడాల్సినవి.

* కొత్త కాలనీల్లో డ్రైనేజీల నిర్మాణం

* కొన్ని కాలనీల్లో చెత్తాచెదారం రోడ్డు పక్కనే పడేస్తున్నారు

* భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts