IMD: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రానున్న 24 గంటల్లో ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు. 

Published : 01 Oct 2022 16:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ పక్రటనలో తెలిపారు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ తీరం నుంచి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణి ఇవాళ బలహీన పడినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు వివరించారు. రానున్న 24 గంటల్లో ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. 

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్​నగర్, నారాయణ గూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌  తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని