logo

దవాఖానాల్లో వణుకు

గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్‌బజార్‌, చార్మినార్‌: రాష్ట్రంలోని వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలు చిన్నపాటి వర్షానికే చెరువులుగా మారుతున్నాయి.

Published : 02 Oct 2022 03:50 IST

 వర్షానికి నీటి మడుగులుగా మారుతున్న ఆవరణలు

 వేలాది మంది రోగులు-సహాయకులకు తీవ్ర ఇబ్బందులు

గాంధీ ఆసుపత్రి రోగుల వార్డు ఆవరణలో నిలిచిన మురుగునీరు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి- న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్‌బజార్‌, చార్మినార్‌: రాష్ట్రంలోని వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలు చిన్నపాటి వర్షానికే చెరువులుగా మారుతున్నాయి. దీంతో వేలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.100 కోట్లు వ్యయం చేస్తే ముఖ్యమైన ఆస్పత్రుల్లో మురుగు-వర్షం నీటిని కిందికి తీసుకువెళ్లే వ్యవస్థలను మెరుగుపర్చవచ్చని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో పనులు సాగడం లేదు. ఇటీవల ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను, వివిధ రకాల యంత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా డ్రైనేజీ, నాలాల వ్యవస్థల మీద దృష్టిసారించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ‘ఈనాడు’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
గాంధీలో తీవ్ర ఇబ్బందే
గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో డ్రైనేజీ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. ప్రధాన భవన సముదాయంలో ఇన్‌పేషెంట్లుగా ఉన్న రోగులకు ఆహార పదార్థాలను వండే వంటశాల ఇక్కడే కొనసాగుతోంది. ఆసుపత్రి నిర్మించిన సమయంలో అప్పటి అవసరాల మేరకు వేసిన డ్రైనేజీ పైపులైనే ఇప్పటికీ ఉంది. ఈ పైపులైన్‌ సమీప కాలనీల నుంచి ప్రధాన నాలాలో కలిసేలా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ప్రక్షాళించేందుకు ఆసుపత్రి పరిపాలనా యంత్రాంగం రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, దాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆమోదం తెలిపారు. నిధులు మంజూరుకాగానే ప్రక్షాళన పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
కోఠి ఈఎన్‌టీ వార్డుల్లోకి వరద..
కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి భూగర్భంలో ఉన్న నిజాంకాలం డ్రైనేజీ నాలా అవరోధంగా మారింది. పురాతన నాలా చెత్తాచెదారంతో నిండిపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి ఆసుపత్రి ఆవరణతోపాటు పలు వార్డుల్లోకి నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  
*  460 పడకలున్న పేట్లబురుజు మెటర్నిటీ ఆస్పత్రి కూడా వర్షం పడితే చెరువుగా మారుతోంది. వర్షం పడితే డ్రైనేజీ, నాలాల వ్యవస్థ సక్రమంగా లేక పరిస్థితి అధ్వానంగా మారుతోందన్న విమర్శలున్నాయి.

వామ్మో ఉస్మానియా
ఉస్మానియా ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బేగంబజార్‌ వాణిజ్య కేంద్రాల నుంచి ఉస్మానియా పాత భవనం, పాత మార్చురీ కింద నుంచి మూసీలోకి నిజాం కాలంలో నిర్మించిన పాత డ్రైనేజీ లైను ఉంది. దీని స్థానంలో పెరుగుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా రూ.50 లక్షల పైచిలుకుతో కొత్త డ్రైనేజీ పైపులైను నిర్మించాల్సిన అవసరం ఉందని రెండేళ్ల క్రితమే జలమండలి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పాత భవనం మూసివేయడంతో ఆ ప్రతిపాదన కాస్త మరుగునపడింది. వర్షం కురిసిన ప్రతిసారి పాత భవనం, పరిసర ప్రాంతాల్లో వరదనీరు చేరడం పరిపాటిగా మారింది.  

 

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని