logo

ఊబకాయం.. పెళ్లికి భారం

ఊబకాయం పెళ్లికి ఆటంకంగా మారింది. మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తక్కువ వ్యవధిలో చికిత్సల ద్వారా బరువు తగ్గొచ్చని వస్తున్న ప్రకటనలకు ఆకర్షితులై మోసపోతున్నారు.

Updated : 02 Oct 2022 10:43 IST

బరువెక్కుతున్న నగర మహిళలు

అసహజ చికిత్సలతో అనారోగ్యం పాలు

- ఈనాడు, హైదరాబాద్‌

ఊబకాయం పెళ్లికి ఆటంకంగా మారింది. మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తక్కువ వ్యవధిలో చికిత్సల ద్వారా బరువు తగ్గొచ్చని వస్తున్న ప్రకటనలకు ఆకర్షితులై మోసపోతున్నారు. సగటు బరువు కన్నా 10 నుంచి 15 కేజీల అధిక బరువును తగ్గించుకునేందుకు వేలు ఖర్చు చేస్తున్నారు. బరువు తగ్గడం మాట అటుంచితే.. శస్త్ర చికిత్సలు విఫలమై తీవ్ర అనారోగ్యంతోపాటు అప్పులపాలవుతున్నారు.  

ఉదంతాలివీ..
* అత్తాపూర్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి 86.2 కేజీల బరువు ఉండటంతో పెళ్లి సంబంధాలు కుదరడం కష్టమైంది. సహజ చికిత్స ద్వారా 20 కేజీల బరువు తగ్గుతారంటూ.. ఓ సంస్థ ప్రకటనకు ఆకర్షితురాలై అత్తాపూర్‌లోని సంస్థను సంప్రదించింది. రూ.80 వేలు ఫీజు కట్టాలని బరువు తగ్గకపోతే డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇవ్వడంతో రుణం తీసుకుని మరీ చికిత్స పొందింది. మూడు నెలల్లో ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో రీఫండ్‌ కోరగా.. ఆ సంస్థ ప్లేటు ఫిరాయించింది. వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, చివరికి న్యాయం దక్కింది.
* పీర్జాదీగూడకు ఓ యువతి 76.3 కేజీల బరువు ఉండటంతో ఓ సంస్థ ప్రకటనకు ఆకర్షితురాలై రూ.35 వేలు చెల్లించారు. సహజ చికిత్సలే ఉంటాయని చెప్పిన ఆ సంస్థ.. అనంతరం యంత్రాల సహాయంతో ‘కరెంట్‌ షాక్‌’ ట్రీట్‌మెంట్‌ అందించారు. దీంతో ఛాతిలో నొప్పితో పాటు మరింత బరువు (78 కేజీలు) పెరిగింది.


ప్రతి ఇద్దరిలో ఒకరు..
రాష్ట్రంలో 30.1 శాతం మహిళలు ఊబకాయంతో బాధపడుతుండగా.. నగరంలో 51 శాతం మంది మహిళల్లో ఈ సమస్య ఉన్నట్లు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ (సీఎస్‌డీ) నివేదిక వెల్లడించింది. ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. మారుతున్న జీవనశైలి... అధిక ఆహారం.. శారీరక శ్రమకు దూరమవ్వడం.. ఒత్తిడి.. నిద్రలేమి తదితర కారణాలతో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.


క్యాలరీ ఖర్చుపై దృష్టి పెట్టాలి
- నవీన్‌, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, అపోలో ఆసుపత్రి
పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతే గుండె, లివర్‌ సంబంధిత సమస్యలతో పాటు ప్రతి అవయవంపై ఆ ప్రభావం పడుతుంది. గుండెపోటు, లివర్‌ సిర్రోసిస్‌ వంటి వ్యాధులు వస్తాయి. రోజూ 20 నిముషాల వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సమతులాహారం తీసుకోవాలి. అన్నం వీలైన మేరకు తగ్గించి.. కూరలు ఎక్కువగా తినాలి. ఉదాహరణకు 100 కేజీలు బరువున్నవారు సహజ పద్ధతుల్లో 10 శాతం తగ్గినా.. ముప్పు తప్పినట్లే.  అనవసర చికిత్సలతో ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని