logo

సర్జరీ అంటే భయం.. అన్నం తినలేని దైన్యం

స్త్ర చికిత్స అంటే భయంతో ఓ మహిళ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆరోగ్యం మరింత సంక్షిష్టంగా మారడంతో ఎట్టకేలకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి పొట్ట భాగం నుంచి భారీ కణితి తొలగించి ప్రాణాలు కాపాడారు.

Updated : 02 Oct 2022 04:22 IST

ఎట్టకేలకు 23 కిలోల కణితి తొలగించిన వైద్యులు

శస్త్రచికిత్స చేసిన వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: శస్త్ర చికిత్స అంటే భయంతో ఓ మహిళ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆరోగ్యం మరింత సంక్షిష్టంగా మారడంతో ఎట్టకేలకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి పొట్ట భాగం నుంచి భారీ కణితి తొలగించి ప్రాణాలు కాపాడారు. నగరానికి చెందిన ఓ వివాహిత(42)కు రెండేళ్ల క్రితం పొట్టలో నొప్పి రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించారు. స్కాన్‌ చేయడంతో అండాశయంలో 15 సెంటీమీటర్ల మందంతో కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే తొలగించాలని..ఈ సర్జరీ కొంత సంక్షిష్టతతో కూడుకుందని వైద్యుడు చెప్పాడు. దీంతో భయపడిన సదరు మహిళ.. తనకేదైనా అయితే పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శస్త్రచికిత్సకు నిరాకరించింది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. ఇటీవల మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పొట్ట భారీగా పెరగడంతోపాటు నడవాలన్నా, పడుకోవాలన్నా,  అన్నం తినాలన్నా,  నీళ్లు తాగాలన్నా ఇబ్బందిగా మారింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. సక్రమంగా రక్తప్రసరణ లేక కాళ్లలో వాపులు పెరిగాయి. వేరే దారి లేక కుటుంబ సభ్యులు ఆమెను ఇటీవల సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. సర్జికల్‌ ఆంకాలజీ విభాగం డాక్టర్‌ నాగేందర్‌ పర్వతనేని వైద్యుల బృందం రెండు రోజుల క్రితం దాదాపు 3 గంటలపాటు శ్రమించి కణితిని విజయవంతంగా తొలగించారు. తొలుత 15 సెంటీమీటర్లు ఉన్న కణితి.. రెండేళ్ల తర్వాత చివరికి 65 సెంటీమీటర్ల చుట్టుకొలతతో దాదాపు 23.7 కిలోల పెరిగిందని డాక్టర్‌ నాగేందర్‌ శనివారం మీడియాకు తెలిపారు. అండాశయంలో 10-15 కిలోల కణుతులు ఉండటం సాధారణమేనని, అయితే ఇంత భారీ పరిమాణంలో కణితి తొలగించడం అరుదని చెప్పారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటోందని త్వరలో డిశ్చార్జి చేయనున్నట్లు వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని