logo

సిబ్బంది లేక.. దస్త్రాలు పరిష్కరించక!

తాండూరు మండలం కరణ్‌కోటకు చెందిన పత్తుయాదవ్‌ గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. స్టంట్లు వేసేందుకు రూ.3 లక్షలవుతుందని, లేదంటే ఆరోగ్యశ్రీకార్డు సమర్పించాలని ఆసుపత్రి వర్గాలు సూచించాయి.

Published : 02 Oct 2022 04:13 IST

కార్యాలయాల్లో పేరుకుపోతున్న అర్జీలు  
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ  

కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది

* తాండూరు మండలం కరణ్‌కోటకు చెందిన పత్తుయాదవ్‌ గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. స్టంట్లు వేసేందుకు రూ.3 లక్షలవుతుందని, లేదంటే ఆరోగ్యశ్రీకార్డు సమర్పించాలని ఆసుపత్రి వర్గాలు సూచించాయి. దీంతో కుటుంబసభ్యులు ఆరోగ్యశ్రీకార్డు వివరాలు పొందేందుకు తాండూరు తహసీల్దారు కార్యాలయానికి మూడు రోజులు తిరగాల్సి వచ్చింది.
* గోనూరు కాగ్నా నది నుంచి రాత్రివేళ జోరుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వీఆర్‌ఓలను ఇతర శాఖలకు బదలాయించగా, గ్రామాల్లోని వీఆర్‌ఏలు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలు సాగకుండా, సహజ సంపద తరలిపోకుండా పర్యవేక్షించే వారు కరవయ్యారు.  
జిల్లాలోని తహసీల్దారు కార్యాలయాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని వీఆర్‌ఓలను ఇతర శాఖల విధులు నిర్వహించేందుకు నియమించింది. జిల్లా వ్యాప్తంగా 199 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో రెవెన్యూ శాఖ యాభై శాతం ఖాళీ అయింది. గ్రామాల్లో విధులు నిర్వహించే వీఆర్‌ఏలు పేస్కేలు ప్రకారం జీతాలు చెల్లించాలని సమ్మె చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది కూడా లేకుండాపోయారు. ఈ ప్రభావం తహసీల్దారు కార్యాలయాలపై పడి, కార్యకలాపాలు నిదానంగా సాగుతున్నాయి.  

వీఆర్‌ఏలను నియమిస్తే..
విద్యార్హతలున్న వీఆర్‌ఏలను తహసీల్దారు కార్యాలయాల్లో నియమిస్తే సిబ్బంది కొరత సమస్యను అధిగమించే వీలుంటుందనే రెవెన్యూ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వీఆర్‌ఓలను సర్దుబాటు చేయడంతో దస్త్రాల పరిశీలన, విచారణలో ఇబ్బందికరంగా మారిందంటున్నారు. డిగ్రీ, ఉన్నత చదువు పూర్తి చేసిన వీఆర్‌ఏలను నియమిస్తే ధ్రువపత్రాల పరిశీలన, గ్రామాల్లో విచారణ, ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలు, కబ్జాలకు గురవకుండా నిఘా ఉంచేందుకు ఉపయోగపడనుంది. దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సేవలు అందించే ఆస్కారమేర్పడనుంది.  
క్షేత్రస్థాయిలో పరిశీలించే వారేరి..
దళితబంధు దరఖాస్తుకు, విద్యార్థులు ఉపకార వేతనాలు, ప్రవేశాలు పొందేందుకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. వీటికోసం లబ్ధిదారులు, యువత, విద్యార్థులు మీసేవా కేంద్రాల్లో అర్జీలు సమర్పిస్తున్నారు. వీఆర్‌ఓలు లేకపోవడం, వీఆర్‌ఏలు సమ్మెలో కొనసాగడంతో వీటిని క్షేత్రస్థాయిలో విచారించే వీల్లేకుండాపోయింది. దీంతో కార్యాలయాల్లోని పరిమిత ఉద్యోగులే అర్జీలను పరిశీలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తహసీల్దారు కార్యాలయాల్లో పేరుకుపోతున్నాయి. విచారించేందుకు గిర్దావర్‌ ఒక్కరే ఉండటంతో రోజుకు నాలుగైదు పరిష్కరించడం గగనమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని