logo

‘ఏకగ్రీవం’.. అందని ప్రోత్సాహకం!

కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా తండాలు, చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. పల్లెల్లో ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటే రూ.15 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా పంచాయతీల్లో ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకున్నారు.

Published : 02 Oct 2022 04:13 IST

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, కొడంగల్‌ గ్రామీణం

సూర్యానాయక్‌తండా పంచాయతీ

కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా తండాలు, చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. పల్లెల్లో ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటే రూ.15 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా పంచాయతీల్లో ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఇది జరిగి దాదాపు మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 19 మండలాల్లో 565 పంచాయతీలకు 2019 జనవరిలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. 75 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన వాటికి  ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు ఫిబ్రవరి 2నుంచి గ్రామాల్లో కొలువు దీరాయి. ఇందులో కొత్త పంచాయతీలే అధికంగా ఏకగ్రీవమయ్యాయి. ముఖ్యంగా గిరిజన తండాలు, చిన్న గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడటంతో జనాభా ప్రాతిపదికన అందిస్తున్న నిధులు గ్రామాభివృద్ధికి సరిపోవటం లేదని సర్పంచులు వాపోతున్నారు.  మొదట్లో చిగురించిన ఆశలు: చిన్న గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే నిధులకు కొరత రాదని అప్పట్లో గ్రామాల పెద్దలు భావించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఎన్నికలు పూర్తయ్యాక అదనంగా రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో నిధులు వస్తాయని ఆశించారు. రాకపోవడంతో సర్పంచులు నిరాశలో ఉన్నారు. చిన్న పంచాయతీలకు అందుతున్న నిధులు నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయని వాపోతున్నారు. పారిశుద్ధ్య పనులు, ట్రాక్టర్ల కొనుగోలు వాయిదాలు, చెత్త సేకరణ, కార్మికుల వేతనాలు, విధీ దీపాల బిల్లులకే సరిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్ల సొంతభవనాలు అందుబాటులో లేకపోవటంతో పాఠశాలలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఫర్నిచర్‌ కొరతతో సర్పంచి అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలను సైతం నేలపై కూర్చుంటున్నారు. వివరాలు పంపించాం: శంకర్‌రాథోడ్‌, డీఎల్‌పీవో, తాండూరు పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఏకగ్రీవ పంచాయతీల వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ఈ విషయంలో సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని