CM KCR: గాంధీ ప్రతి మాటా.. ప్రతి అడుగూ ఆచరణీయం: సీఎం కేసీఆర్‌

గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయం. బాపూజీ చూపిన అహింసా మార్గం శాశ్వతమైనది. మానవోత్తముడు, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. కరుణ, ధైర్యంతో నిస్సహాయతను ఎదుర్కోవచ్చని ఆయన చాటారు -కేసీఆర్‌

Updated : 02 Oct 2022 14:23 IST

హైదరాబాద్: కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఆవరణలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. దేశానికి గాంధీజీ అందించిన సేవలను స్మరించుకున్నారు.

గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారని సీఎం ప్రశంసించారు. కరోనా సమయంలో రోగులను మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడారన్నారు. వసతులు లేకున్నా ప్రజలకు సేవ చేశారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ధ్యానముద్రలో ఉన్న ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గొప్ప విషయమని.. దీని ఏర్పాటు అంశంలో మంత్రి శ్రీనివాస్‌కు చిరస్థాయి కీర్తి దక్కుతుందని చెప్పారు.

‘‘గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయం. బాపూజీ చూపిన అహింసా మార్గం శాశ్వతమైనది. మానవోత్తముడు, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. కరుణ, ధైర్యంతో నిస్సహాయతను ఎదుర్కోవచ్చని ఆయన చాటారు. కుల, మత, వర్గ రహితంగా ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్యం వైపు నడిపిన సేనాని గాంధీ. ఆయన ప్రతి మాటా.. ప్రతి అడుగూ ఆచరణీయం.

అందుకే స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాం. 5వేల షోలలో సుమారు రెండున్నర కోట్ల మంది చూశారు. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి వాళ్లు మహాత్ముడి మార్గాన్ని అనుసరించారు. దలైలామా సైతం గాంధీ తనకు ఆదర్శమన్నారు. గాంధీజీ ఈ భూమిపై పుట్టకపోయుంటే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యే వాడిని కాదని బరాక్‌ ఒబామా పేర్కొన్నారు. 

అలా చేసినంత మాత్రాన ఆయన గొప్పతనం తగ్గదు..

బక్కపల్చని వాడు ఏం చేస్తారని నన్ను చాలా మంది అవహేళన చేశారు. అప్పుడు నేను గాంధీజీనే స్మరించుకునేవాడిని. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ఆయనే ప్రేరణ. దేశం బావుంటే అందరం బావుంటాం. శాంతి లేకపోతే జీవితం చాలా బాధగా ఉంటుంది. గాంధీజీనే అవమానించే పరిస్థితులను చూస్తున్నాము. వెకిలి వ్యక్తులు చేసే హేళనల వల్ల మహాత్ముడి గొప్పతనం తగ్గదు. మరుగుజ్జులు మహాత్ములు కాలేరు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని