logo

నేతల అండ.. పాతెయ్‌ జెండా!

కొండాపూర్‌లోని సర్వే నం.133, 134లో జంగమోని కుంట.. ఇటీవల కొందరు అప్పటికప్పుడు జేసీబీలు తీసుకొచ్చి కుంటను పూడ్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది.

Published : 03 Oct 2022 03:56 IST

ప్రభుత్వ భూముల్లో పెచ్చరిల్లుతున్న ఆక్రమణలు
పేదల పేరు చెప్పి హస్తగతం చేసుకునే కుట్రలు
ఈనాడు, హైదరాబాద్‌

* కొండాపూర్‌లోని సర్వే నం.133, 134లో జంగమోని కుంట.. ఇటీవల కొందరు అప్పటికప్పుడు జేసీబీలు తీసుకొచ్చి కుంటను పూడ్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది.

* నగర శివారు  పెద్ద అంబర్‌పేట తట్టి అన్నారంలో సర్వే నం.26లో వెలసిన అక్రమ కట్టడాలను తాజాగా అధికారులు కూల్చివేశారు. దీనికి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు  తెలుస్తోంది.

* గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌ వెనక ఉన్న అల్లూరి సీతారామరాజు నగర్‌లో 2000 చ.గజాల ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకున్నారు. ఏళ్ల తరబడిగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆక్రమణలు తొలగించారు.

ఖాళీ జాగా కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఒకటా..రెండా.. ఎన్నో ఘటనలు. నగరంతోపాటు శివారుల్లో పెద్దఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. పుష్కరకాలం కిందట రెవెన్యూ యంత్రాంగం చేసిన సర్వేలో దాదాపు పది వేల ఎకరాలు ఉన్నట్లు తేలింది. వీటిల్లో కొన్ని వివిధ సంస్థలకు అప్పగించగా.. మిగిలినవి ఖాళీగానే ఉన్నాయి. ఈ స్థలాలు ఇటీవల కబ్జాకు గురవుతున్నాయి. రాజకీయ నాయకులు వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల పేరు చెప్పి కబ్జాలను ప్రోత్సహిస్తూ.. తర్వాత వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ఆ భూములను దక్కించుకుంటున్నారు. వీఆర్వోల వ్యవస్థలో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో నిఘా కొరవడుతోంది. స్థానికులు సమాచారమిస్తే తప్ప అధికారులకు విషయం తెలియడం లేదు.

పర్యవేక్షణ కొరవడి..
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు నాయకులు, కబ్జారాయుళ్లు చేయని ప్రయత్నాలు లేవు. గతంలో ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించి.. బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖంపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో.. ప్రస్తుతం నగరంలోని ఎక్కడా ప్రభుత్వ భూములకు హద్దులు లేవు. ఆక్రమణదారులు ఎప్పటికప్పుడు హద్దులు చెరిపేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ భూమిగా సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులు పీకేశారు.

సెలవులొస్తే ఆక్రమణలే..
ఒకటి లేదా రెండు రోజులు సెలవులు వస్తే కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అప్పటికప్పుడు జేసీబీలు తరలించి చదును చేయడం, రాత్రికి రాత్రే గుడిసెలు వేసి ఫెన్సింగ్‌ కడుతున్నారు. ప్రస్తుతం దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో వరస సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో కబ్జారాయుళ్లు బరి తెగించేందుకు అవకాశం ఉంది. కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి, ఆసిఫ్‌నగర్‌, కొండాపూర్‌లోని భూములపై ఇప్పటికే కబ్జాదారులు కన్నేసి ఉన్నారు. ప్రభుత్వ భూములపై మండలాల వారీగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని