logo

చికిత్సలే ఉచితం..మందులు భారం

నగర ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సలు మాత్రమే ఉచితంగా అందుతున్నాయి. మందులు మాత్రం ప్రైవేటులో కొనాల్సి వస్తోంది. దీంతో రోగులపై ఆర్థిక భారం పడుతోంది. వైద్యుడు ఆరు రకాలు రాస్తే.. సగమే ఉచితంగా అందిస్తున్నారు. కొందరికి 10 రోజులకు మందులు రాస్తే.. 5 రోజులకు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.

Published : 04 Oct 2022 03:04 IST

సగం ఔషధాలు బయటే కొంటున్న రోగులు

ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి

గాంధీ ఆసుపత్రిలో మందులు పంపిణీ చేసే ఫార్మసీ

నగర ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్సలు మాత్రమే ఉచితంగా అందుతున్నాయి. మందులు మాత్రం ప్రైవేటులో కొనాల్సి వస్తోంది. దీంతో రోగులపై ఆర్థిక భారం పడుతోంది. వైద్యుడు ఆరు రకాలు రాస్తే.. సగమే ఉచితంగా అందిస్తున్నారు. కొందరికి 10 రోజులకు మందులు రాస్తే.. 5 రోజులకు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మిగతా అయిదు రోజుల కోసం రోగులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని.. బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదంటూ అధికారులు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రోగులు వాపోతున్నారు. ఓపీకి రోగులకు వైద్యులు రాస్తున్న మందులు.. ఫార్మసీ వద్ద ఇస్తున్న వాటికి మధ్య పొంతన కుదరడం లేదు. ఈ అంశంపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా..పలువురు రోగులు తమ ఇబ్బందులను వెల్లడించారు.

ఎందుకిలా...: గాంధీ, ఉస్మానియాతోపాటు నిలోఫర్‌, ప్లేట్లబుర్జు, ఈఎన్‌టీ ఆసుపత్రులకు ఏటా రోగుల తాకిడి పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత 30 శాతం వరకు రోగుల తాకిడి పెరిగింది. పాత ఇండెంట్‌ ప్రకారమే వైద్య ఆరోగ్యశాఖ మందులు సరఫరా చేస్తోంది. ఉదాహరణకు 20 రకాల మందులకు ఇండెంట్‌ పెడితే అందులో 10-12 రకాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఇటీవల కొన్ని రకాల మందుల సరఫరా పెంచినా సరే.. రోగుల తాకిడితో పోల్చితే అవి ఎటూ సరిపోవడం లేదని అంటున్నారు. కొన్ని రకాల బీపీ మందులు, దగ్గు, మధుమేహం, మల్టీ విటమిన్‌ మాత్రలు, నొప్పి నివారణ ఔషధాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేటు మందుల దుకాణాలను తొలగించి.. అన్ని మందులను తామే సరఫరా చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. వైద్యులు బయటకు మందులు రాస్తే...చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. తగినన్ని మందులు సరఫరా కాకపోవడం వల్లే.. బయటకు రాస్తున్నామని మరోవైపు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో రోగి కనీసం రూ.500 నుంచి రూ.3 వేల వరకు వెచ్చించి బయట కొంటున్నారు. డబ్బులు లేని వారు.. కౌంటర్‌లో ఇచ్చిన ఉచిత మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఒక్క గాంధీ ఆసుపత్రి పరిధిలోనే నెలకు తక్కువలో తక్కువ ప్రైవేటు దుకాణాల్లో రూ.3-5 కోట్లు వరకు మందులు విక్రయిస్తున్నారు.

డబ్బులు లేక కొనలేదు: రిచర్డ్‌, పాతబస్తీ

జ్వరంగా ఉంటే వచ్చి డాక్టర్‌కి చూపించాను. ఐదు రకాల మందులు రాశారు. గాంధీ పార్మసీ దగ్గర మూడు రకాలే ఇచ్చారు. మిగతావి బయట కొనుక్కుందామని వెళితే ఐదొందలు అవుతాయంటే డబ్బుల్లేక కొనలేదు.

బయట కొనుక్కోమంటున్నారు: లక్ష్మి, మల్కాజిగిరి

మా ఆయన్ని అనారోగ్యంతో ఉస్మానియాలో చేర్పించా..కొన్ని రకాల ఇంజక్షన్లు.. మాత్రలు బయట నుంచి తెచ్చుకోవాలని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. బయట కొనాలంటే రోజూ రూ.వేయి కంటే ఎక్కువే ఖర్చవుతోంది. డబ్బులు లేకే ఇక్కడకు వచ్చాం. అలాంటిది మందుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది.

3 రోజులకే ఇచ్చారు: సాయికృష్ణ, మంచిర్యాల

మా నాన్నకు ఒంట్లో బాగలేకపోతే ఉస్మానియా ఓపీలో చూపించాను. వైద్యులు ఆరు రోజులకు మందులు రాశారు. ఇవన్నీ పూర్తిగా వాడితేనే రోగం తగ్గుతుందని చెప్పారు. తీరా కౌంటర్‌ వద్దకు వెళ్తే మూడు రోజులకే ఇచ్చారు. అడిగితే అంతే ఉన్నాయని, మిగతావి బయట కొనుక్కోవాలని చెప్పారు. వేరే దారి లేక బయట కొన్నా.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts