logo

రావణ దహనంలో మారణహోమమే లక్ష్యం?

2005 అక్టోబరు 12, బుధవారం, విజయదశమి. సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై బంగ్లాదేశ్‌కు చెందిన డాలిన్‌ ఆత్మాహుతి దాడి. ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. విధుల్లో ఉన్న హోంగార్డు సహా డాలిన్‌ మరణించాడు.

Published : 04 Oct 2022 03:04 IST

2005 ఘటనలో సహాయపడిన జాహెద్‌ సూత్రధారిగా ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌, చంచల్‌గూడ, న్యూస్‌టుడే: 2005 అక్టోబరు 12, బుధవారం, విజయదశమి. సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై బంగ్లాదేశ్‌కు చెందిన డాలిన్‌ ఆత్మాహుతి దాడి. ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. విధుల్లో ఉన్న హోంగార్డు సహా డాలిన్‌ మరణించాడు. ఈ దాడికి పథకం పాకిస్తాన్‌ నుంచే జరిగింది. డాలిన్‌కు సాయం చేసిన వారి జాబితాలో మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ అరెస్టయ్యాడు.

2022 అక్టోబరు 5, బుధవారం, విజయదశమి. భారీగా ప్రాణనష్టం లక్ష్యం. ఇదే పట్టుబడిన ముగ్గురు ఉగ్రమూకల పథకం. ఈ సారి రంగంలోకి దిగింది అప్పటి సహాయకుడు అబ్దుల్‌జాహెద్‌. 12 ఏళ్లపాటు జైల్లో ఉంచినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇతడి పగను పాక్‌ ఉగ్రవాద సంస్థలు పావుగా వాడుకున్నాయి. ఈ దఫా భారీ స్కెచ్‌. దసరా రోజు జరిగే వేడుకల్లో మారణహోమం. దాన్ని అమలు చేసేందుకు నగరంలో బతుకమ్మ వేడుకలు, రావణ దహనం జరిగే నాలుగైదు ప్రదేశాల్లో(మైదాన ప్రాంతాలను) రెక్కీ నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు ముందుగా ఉగ్రమూక పన్నాగం గుర్తించకపోతే రావణ దహనం నిర్వహించే ఏదో ఒక చోట గ్రనేడ్స్‌తో దాడి చేయాలనేది పాకిస్తాన్‌ నుంచి జాహెద్‌కు అందిన ఆదేశంగా పోలీసు వర్గాలు అంచనాకు వచ్చాయి.

ముప్పు తప్పించి..

పండగలు, సామూహిక వేడుకలు జరిగే తరుణం. భద్రతాపరంగా ఏ చిన్న తప్పు జరిగినా భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అనుమానితులు తప్పించుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు పకడ్బందీ ప్రణాళికతో దాడులు చేశారు. నగరంలో బాంబు పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. సిట్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కుట్రను నిలువరించగలిగారు. మూసారాంబాగ్‌, అక్బర్‌బాగ్‌, హుమాయున్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న కీలక నిందితులు అబ్దుల్‌ జాహెద్‌, మహ్మద్‌ సమీయుద్దీన్‌, మాజ్‌హసన్‌ ఫరూక్‌లను అరెస్ట్‌ చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిఘా వర్గాల సమాచారంతో రెండ్రోజుల ముందు పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాలు కావటంతో ఎక్కడా ప్రతిఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకకాలంలో పది ఇళ్లలో దాడులు నిర్వహించారు. విషయం బయటకు పొక్కేలోపే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. 48 గంటల వ్యవధిలోనే ఆపరేషన్‌ ముగించి, నగరంలో భారీ విధ్వంసాన్ని నిలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని