కొబ్బరిబొండాల మాటున గంజాయి

కొబ్బరిబొండాల మాటున భారీఎత్తున గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వరంగల్‌ జాతీయ రహదారిపై పట్టుబడింది.

Updated : 04 Oct 2022 05:01 IST

ఒడిశా నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు

900 కిలోలు స్వాధీనం.. నలుగురి అరెస్టు

డీసీఎంలో బస్తాల మాటున గంజాయి

ఈనాడు- హైదరాబాద్‌: కొబ్బరిబొండాల మాటున భారీఎత్తున గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వరంగల్‌ జాతీయ రహదారిపై పట్టుబడింది. ఇంత పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ బృందం, ఆలేరు పోలీసుల సహకారంతో నలుగుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 900 కిలోల గంజాయి, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ ఉన్న డీసీఎం, కొబ్బరిబోండాలు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

గతంలో నాలుగుసార్లు..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన యోగేశ్‌ దత్తు గైక్వాడ్‌ ఈ ముఠా ప్రధాన సూత్రధారి. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెప్పించుకుని మహారాష్ట్రలో విక్రయించేందుకు తన మిత్రులు అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన పెయింటర్‌ వికాస్‌ బాబన్‌ సాల్వే(28), కూలీ పనులు చేసుకునే వినోద్‌ చంద్ర వంకాల్కర్‌(26), డ్రైవర్‌ కిషోర్‌ తులసీరామ్‌ వాడేకర్‌(24)ను సంప్రదించాడు. కమిషన్‌ ఆశ చూపి గంజాయి తరలించేందుకు ఒప్పించాడు. వీరికి మల్కన్‌గిరి జిల్లాకు చెందిన సరఫరాదారు పలాసి కర్రయ్యను(28) పరిచయం చేశాడు. అతడి నుంచి రూ.3వేల చొప్పున కిలో గంజాయి కొని మహారాష్ట్రలో రూ.20 వేలకు విక్రయించేవాడు. ఇలా నాలుగుసార్లు హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలించాడు. వీరు యోగేశ్‌ దత్తుకు లోడు అందించి తమ వంతు వాటా తీసుకుంటారు.

రావులపాలెంలో రూ.లక్ష వెచ్చించి

కొన్ని వారాల క్రితం యోగేశ్‌ దత్తు సూచన మేరకు వికాస్‌ బాబన్‌ సాల్వే, వినోద్‌ చంద్ర, తులసీరామ్‌ వాడేకర్‌ ముగ్గురు డీసీఎంతో తూగో జిల్లా రావులపాలెం దగ్గర రూ.లక్షకుపైనే వెచ్చించి కొబ్బరిబొండాలు నింపిన బస్తాలను కొని మల్కన్‌గిరి జిల్లా వెళ్లి పలాసికర్రయ్య దగ్గర గంజాయి కొన్నారు. దాన్ని బస్తాల్లో సర్ది కొబ్బరిబోండాల కింద వేశారు. వీరికి దారి చూపించేందుకు 19 ఏళ్ల చిట్టిబాబు వచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సుధాకర్‌.. ఆలేరు పోలీసుల సాయంతో వరంగల్‌- యాదాద్రి రహదారిపై మాటు వేసి నలుగుర్ని అరెస్టు చేశారు. యోగేశ్‌ దత్తు, పలాసి కర్రయ్య పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని