logo

ఎలక్ట్రిక్‌ బస్సులు ఎటు తిప్పుదాం

ఈ నెలాఖరుకు కొత్తగా 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న మార్గాలను ఎంపిక చేసిన పనిలో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పడింది. వచ్చే ఏడాది నుంచి ఐటీ సంస్థలు కూడా పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచి పని చేయనున్న నేపథ్యంలో రూటు సర్వేలు చేస్తోంది.

Published : 04 Oct 2022 03:03 IST

మార్గాల ఎంపికపై ఆర్టీసీ అధికారుల కసరత్తు

నెలాఖరుకు అందుబాటులోకి 300 సర్వీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెలాఖరుకు కొత్తగా 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న మార్గాలను ఎంపిక చేసిన పనిలో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పడింది. వచ్చే ఏడాది నుంచి ఐటీ సంస్థలు కూడా పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచి పని చేయనున్న నేపథ్యంలో రూటు సర్వేలు చేస్తోంది. అన్ని కొత్త మార్గాల్లోనే కాకుండా.. పాత, కొత్త రూట్లలో బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటుంది. మెట్రో అందుబాటులో లేని మార్గాల్లో ఎక్కువ ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పేందుకు యోచిస్తోంది.

ఐటీ కారిడార్‌కే ప్రాధాన్యం..

ఐటీ కారిడార్‌లో మొత్తం 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇంతమంది సొంత వాహనాలు లేదా.. కార్యాలయాలు సమకూర్చే వాహనాల్లో వెళ్తే ట్రాఫిక్‌ జామ్‌లు ఎక్కువవుతాయి. అందుకే కొత్తగా రానున్న 300 ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఐటీ కారిడార్‌కు ఎక్కువ తిప్పాలని గ్రేటర్‌జోన్‌ అధికారులు చూస్తున్నారు. ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్లను లక్ష్యంగా చేస్తూ బస్సులను నడపాలని చూస్తోంది. ఒక్కసారి మెట్రో వస్తే 800 నుంచి వెయ్యిమంది వరకూ దిగుతున్నారు. అలాగే ఎంఎంటీఎస్‌ రైలులో అయితే 1500-2000 మంది దిగుతున్నారు. వీరిని ఐటీ కారిడార్‌కు చేర్చాలంటే.. ప్రతి అరగంటకు 50 నుంచి 80 సర్వీసులు అవసరం. ఉదయం సాయంత్రం వేళ ఈ సర్వీసులను ఇటు నడిపి.. తర్వాత సమయంలో కోఠి-కొండాపూర్‌ మార్గాల్లో నడపాలని చూస్తోంది. మిగతా బస్సులన్నిటిలో 150 బస్సుల వరకూ మెట్రో లేని దూర మార్గాలకు నడిపితే ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది.

మరిన్ని డిపోల్లో.. ఛార్జింగ్‌ పాయింట్లు

ప్రస్తుతం కంటోన్మెంట్‌ డిపోలోనే ఎలక్ట్రిక్‌ బస్సుల ఛార్జింగ్‌ పాయింట్లున్నాయి. కొత్తగా 300 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్న వేళ.. రాణిగంజ్‌, ముషీరాబాద్‌, మియాపూర్‌ డిపోల్లో ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసి.. కొత్త సర్వీసులను ఆయా డిపోలకు కేటాయించాలనుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని