logo

యువశక్తి.. ఏదీ దీప్తి?

యువతలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నా వారికి తగిన తోడ్పాటు అందడంలేదు. పల్లె ప్రగతిలో వారి పాత్ర కీలకమైనా ఆశించిన స్థాయిలో అడుగు పడటంలేదు. మహనీయుల స్ఫూర్తితో యుజన సంఘాలు ఏర్పాటు చేస్తున్నా, ప్రోత్సాహం అందక ఆశయం నెరవేరడంలేదు...

Published : 04 Oct 2022 03:03 IST

కొరవడిన ప్రోత్సాహం

న్యూస్‌టుడే, పరిగి

యువతలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నా వారికి తగిన తోడ్పాటు అందడంలేదు. పల్లె ప్రగతిలో వారి పాత్ర కీలకమైనా ఆశించిన స్థాయిలో అడుగు పడటంలేదు. మహనీయుల స్ఫూర్తితో యుజన సంఘాలు ఏర్పాటు చేస్తున్నా, ప్రోత్సాహం అందక ఆశయం నెరవేరడంలేదు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 534 సంఘాలు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నమోదై ఉన్నాయి. సుమారు 16,500 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. క్షేత్రస్థాయిలో తగిన సహకారం అందకపోవడంతో అవి బోర్డులకే పరిమితమవుతున్నాయి. కార్యక్రమాల అమలుకు నిధులు విడుదల కాకపోవడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా జిల్లాలో ఎన్‌వైకే పనితీరు తీసికట్టుగానే తయారైంది. యువతకు నాయకత్వ లక్షణాలు కల్పించడం, సాధికారత, ప్రతి గ్రామంలో యువజన సంఘాల ఏర్పాటు, నాయకులుగా తీర్చిదిద్దడం, వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం యువ కేంద్రం లక్ష్యాలు. వీటిలో ఏ ఒక్కటీ జరగడం లేదు.

గతమెంతో ఘనం: సంఘాలు గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించాయి. గతంలో పరిగి మండలం చిగురాల్‌పల్లికి ఆర్టీసీ బస్సు వెళ్లేది కాదు. అలాంటిది యువజన సంఘం సభ్యులంతా సమష్టిగా అప్పట్లో రోడ్డుకు ఇరువైపులా పొదల తొలగింపునకు శ్రమదానం చేశారు. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతు చేసి, ఆర్టీసీ బస్సును రప్పించారు. మిట్టకోడూరు, సుల్తాన్‌పూర్‌, కాళ్లాపూర్‌ తదితర గ్రామాల్లో యువజనులు ప్రతినెలా మురుగు కాల్వలను శుభ్రం చేసేవారు సారా అక్రమ విక్రమాలపై పోరు ప్రారంభించి అనేక విజయాలు సాధించారు. ఇలా సమస్యల పరిష్కారం చేయడంతో అప్పట్లో జిల్లాస్థాయిలో మిట్టకోడూరు సంఘం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. నేడు ఉత్సాహం ఉన్నా, ప్రోత్సాహం అందడం లేదని పలువురు యువకులు వాపోతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం యువజన సంఘాల బోర్డులు కనిపించడం లేదు.

ఇలా చేస్తే మేలు

* యువజన సంఘాలకు పూర్వవైభవం తీసుకురావాలి.

* క్షేత్రస్థాయిలో వాలంటీర్ల నియామకం జరగాలి.

* సమాజ సేవ చేస్తున్న సంఘాలకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి.

* మండల, తాలుకా స్థాయిలో శిక్షణ ఇవ్వాలి.

* క్రీడా పరికరాలను అందజేయాలి.

* అభివృద్ధి పనుల్లోనూ భాగస్వామ్యం కల్పించాలి.

తోడ్పాటు అందించేందుకు కృషి : హనుమంతరావు, జిల్లా యువజన క్రీడల అధికారి

ఎన్‌వైకే ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రయత్నిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోనే ప్రధాన కార్యాలయం ఉంది. నిర్వాహకులు అక్కడే ఉన్నారు. స్థానికంగా ఉన్న విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్లాం. సంఘాలకు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts