logo

దృష్టి సారిస్తేనే.. ‘స్వచ్ఛ’త!

జిల్లాలోని నాలుగు పురపాలికలు స్వచ్ఛత పోటీల్లో అవార్డులు సాధించలేకపోయాయి. పాలకవర్గం, అధికారులు ప్రత్యేక కార్యాక్రమాలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఏటా కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో పరిశుభ్రతను పెంచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలను నిర్వహిస్తోంది.

Published : 04 Oct 2022 03:03 IST

సర్వేక్షణ్‌లో చోటు దక్కని పురపాలికలు

తాండూరు రైల్వేస్టేషన్‌ రోడ్డులో పేరుకుపోయిన చెత్త

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌, పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీ, కొడంగల్‌: జిల్లాలోని నాలుగు పురపాలికలు స్వచ్ఛత పోటీల్లో అవార్డులు సాధించలేకపోయాయి. పాలకవర్గం, అధికారులు ప్రత్యేక కార్యాక్రమాలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఏటా కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో పరిశుభ్రతను పెంచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి మార్కులు ఆధారంగా మున్సిపాలిటీలకు ర్యాంకులు కేటాయించి, అవార్డులు ప్రకటించారు. అందులో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ పట్టణాలకు చోటుదక్కలేదు.

అవార్డుల ప్రకటన ఇలా...: పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మల,మూత్ర విసర్జన, ఘన, ద్రవ వ్యర్థాలు వేరు చేయడం, సామాజిక శౌచాలయాల వినియోగం, ప్రజల భాగస్వామ్యం వంటి వివిధ అంశాలపై ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో సర్వే నిర్వహించారు. ఆయా అంశాలపై 90 శాతం మార్కులు సాధించిన వారికి అవార్డులు ప్రకటించారు

తాండూరు: పట్టణంలో 36 వార్డులున్నాయి. నిత్యం 2 మెట్రిక్‌ టన్నుల తడి, పొడి చెత్త వెలువడుతోంది. అయితే పూర్తి స్థాయిలో తొలగటం లేదు. గతంలో రాష్ట్ర స్థాయిలో 31 స్థానం నుంచి 27కు చేరింది. జోనల్‌ స్థాయిలో గతంలో 127 స్థానం నుంచి 101 స్థానానికి వచ్చింది. పట్టణంలోని వీధుల్లో, ప్రధాన రోడ్లు, దారుల పక్కన చెత్త పేరుకుపోతోంది. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలేదు. అధికారులు, పాలకవర్గం సమన్వయంతో సాగితేనే ఫలితం ఉంటుంది.

పరిగి: ఈ పురపాలక సంఘం పరిధిలో 15 వార్డులున్నాయి. నిత్యం 10 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. తొలగిస్తున్నది మాత్రం కేవలం 6 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ప్రజల్లో చైతన్యం లేకపోవటం, అధికారులు సరిగా అవగాహన కల్పించకపోవడంతో తడి, పొడి చెత్త వేరు కావటం లేదు.

ర్యాంకులు వచ్చినా..: వికారాబాద్‌, కొడంగల్‌ పురపాలక సంఘాలకు ర్యాంకులు వచ్చినా అవార్డులు మాత్రం దక్కలేదు. వికారాబాద్‌ పట్టణానికి రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకు వచ్చింది. జాతీయ స్థాయిలో 21 ర్యాంకుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్లలో ర్యాంకులు సాధిస్తూ వస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, సామాజిక శౌచాలయాల వినియోగం వంటి వాటిని మెరుగు పరుచుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొడంగల్‌ పురపాలికకు 15 వేల జనాభా విభాగంలో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు దక్కినా, అవార్డు రాలేదు. పట్టణంలో ఇంటింటికీ మరుగుదొడ్లు లేకపోవటం, శౌచాలయాలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోక పోవటం వంటి అంశాలు ప్రభావం చూపాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం లోపాలను సరిదిద్దుకుని వచ్చే ఏడాది అవార్డు దక్కించుకునేందుకు కృషి చేస్తామని కొడంగల్‌ పురపాలక సంఘం కమిషనరు నాగరాజు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని