logo

రుణమాఫీకి నిరీక్షణ..!

వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడులు అన్నదాతలను కలవర పెడుతున్నాయి. ఓవైపు కూలీలు, ఇంకోవైపు ఇంధన ధరలు, మరోవైపు రాయితీ లేని విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలా అనేక రకాలు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

Published : 05 Oct 2022 03:10 IST

అన్నదాతల చూపు.. సర్కారు వైపు

న్యూస్‌టుడే, పరిగి: వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడులు అన్నదాతలను కలవర పెడుతున్నాయి. ఓవైపు కూలీలు, ఇంకోవైపు ఇంధన ధరలు, మరోవైపు రాయితీ లేని విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలా అనేక రకాలు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వానాకాలం సీజన్‌లో అప్పు చేసి పంటలు వేసుకుంటే భారీ వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే మినుము, పెసర పంటలు చేతికందాయి. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితులు నెలకొన్నాయి. మొక్కజొన్న, పత్తిపై చాలా వరకు ఆశలు వదులుకున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగానే మళ్లీ యాసంగి (రబీ) సీజన్‌ ప్రారంభమైంది. పెట్టుబడుల కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్ష రుణమాఫీ కోసం వేయి కళ్లతో ఎదరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

ఇప్పటి వరకు రెండుసార్లే..

జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో రబీకి 78,985 ఎకరాలు సాధారణ సాగు ఉంది. సన్న, చిన్నకారు రైతులు 2.40 లక్షల మంది వరకు ఉన్నారు. ఖరీఫ్‌ దిగుబడులు పడిపోయిన తరుణంలో రెండో పంటను ఎలా సాగు చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రెండు సార్లు రుణమాఫీని అమలు చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.25వేల వరకు 10,807 మంది రైతులకు రూ.16.24 కోట్లు, రెండో విడతలో 25,001 నుంచి రూ.50వేల వరకు 21,193 మంది రైతులకు రూ.78.41 కోట్లు మాఫీ చేసింది. ఇంకా కొందరు రైతులు రెండో విడతలో మిగిలి ఉన్నారు. వివిధ సాంకేతిక కారణాలతో సుమారు ఆరువేల మంది నిరీక్షిస్తున్నారు. రూ.లక్ష రుణమాఫీని కూడా ప్రభుత్వం ప్రకటించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

బ్యాంకర్ల సహకారం ఏదీ?

బ్యాంకర్ల సహకారం రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. రుణాలను క్రమబద్ధీకరించుకోవడంతోనే కాలం నెట్టుకొస్తున్నారు. వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తుండగా.. చాలా మంది రెన్యూవల్స్‌కు దూరంగా ఉంటున్నారు. కొన్నిచోట్ల బ్యాంకర్లు రైతుబంధుకూ ముడిపెట్టారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే వరకు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. రబీలో అధికంగా వేరు సెనగ, శనగ, వరి, మొక్కజొన్న తదితర పంటలు సాగులోకి రానున్నాయి. వేరు సెనగ, శనగ విత్తనాలపై రాయితీ ఎత్తేయడంతో మోయలేని భారం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తే కొత్త రుణాలకు అవకాశం కలుగుతుందని చెబుతున్నారు.

ఆదేశాలు రాలేదు -గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఇంకా ఆదేశాలు రాలేదు. ప్రభుత్వమే దానిని ప్రకటించి చెబుతుంది. రూ.50వేల వరకు చాలా మందికి పథకం వర్తించింది. సాంకేతిక కారణాలతో కొన్ని నిలిచి పోయాయి. అవి కూడా పరిష్కారం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు