logo

‘శాలసిద్ధి’తోనే.. బడి అభివృద్ధి

‘శాలసిద్ధి’లో నమోదైన వివరాల ఆధారంగా ప్రభుత్వం బడులకు నిధులు సమకూరుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నమోదు ప్రక్రియను చేపట్టలేదు.

Published : 05 Oct 2022 03:10 IST

చిట్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల..

కొడంగల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ‘శాలసిద్ధి’లో నమోదైన వివరాల ఆధారంగా ప్రభుత్వం బడులకు నిధులు సమకూరుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నమోదు ప్రక్రియను చేపట్టలేదు. పరిస్థితులు చక్కబడటంతో 2022- 23 ఏడాదికి సంబంధించిన పాఠశాల పూర్తిస్థాయి సమాచారం నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో కథనం..

జిల్లాలో ఇలా..: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కొన్ని బడుల్లో ప్రధానోపాధ్యాయులు సైతం లేకపోవటంతో ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకే అవస్థలు పడుతున్నారు. యూడైస్‌ ఆధారంగా పాఠశాలలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని శాలసిద్ధి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తేనే నిధులు మంజూరు చేస్తారు. జిల్లాలోని 19 మండలాల్లో 748 ప్రాథమిక, 118 ప్రాథమికోన్నత, 154 ఉన్నత పాఠశాలలుండగా విభాగాల వారీగా సమాచారం తీసుకుంటున్నారు. తరగతి గదుల కొరత, తాగునీరు, ప్రహరీలు, శౌచాలయాలు, వంటగది తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో బడిలో సదుపాయాలు కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. పాఠశాలలోని సమస్యలు తెలుసుకునేందుకు ‘శాలసిద్ధి’లో నమోదు చేసిన వివరాల ఆధారంగానే నిధులు వస్తాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబతున్నారు.

పాఠశాలల వారీగా..

జిల్లాలోని 1,026 పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంది. ప్రధానంగా వనరులు, అవసరాల వినియోగం, బోధన, అభ్యసన, మదింపు, విద్యార్థుల ప్రగతి, వారి సాధన, పాఠశాల నాయకత్వం, సమ్మిళిత విద్య, ఆరోగ్యం తదితర సమాచారాన్ని పాఠశాల వారీగా వెబ్‌సైట్‌లో చేర్చాలి. నిర్దేశిత అంశాలకు సంబంధించిన సమాచారంతో పాటుగా పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులు, వంటగది లేకుంటే అందుకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. ప్రధానోపాధ్యాయులు పాఠశాల పూర్తిస్థాయి సమాచారం, ఫొటోలతో ‌www.shaalashiddi.nuepa.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.

నమోదు ప్రక్రియ ప్రారంభిస్తాం -రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి

పాఠశాలల సమాచారాన్ని నమోదు చేయాలనే ఆదేశాలు వచ్చాయి. సెలవుల తర్వాత ఉపాధ్యాయులకు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై తొలుత శిక్షణ ఇస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయి వివరాలు గడువులోగా నమోదు చేయాలి. అంతర్జాల సమస్య, ఉపాధ్యాయుల కొరత కారణాలుగా చూపకుండా సమాచారం నమోదు చేసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని