logo

రంగులమాయ!

బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బస చేసిన వ్యాపారికి చెందిన బంగారు వజ్రాభరణాల పెట్టె మాయమై చిక్కిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ డీఐ మహ్మద్‌ హఫీజుద్దీన్‌ వివరాల ప్రకారం..

Published : 05 Oct 2022 03:10 IST

హోటల్‌లో మాయమైన ఆభరణాలు లభ్యం


పెట్టెను చూపుతున్న డీఐ హఫీజుద్దీన్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బస చేసిన వ్యాపారికి చెందిన బంగారు వజ్రాభరణాల పెట్టె మాయమై చిక్కిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ డీఐ మహ్మద్‌ హఫీజుద్దీన్‌ వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ డైరెక్టర్‌ ఫరూక్‌ అహ్మద్‌ బేగ్‌(47) గత నెల 24న బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌కి హనీమూన్‌కు వచ్చారు. ఆ సమయంలో క్రికెట్‌ జట్టు బస చేయడంతో.. తమకు సరైన సేవలు అందడం లేదని 25న గది ఖాళీ చేశారు. ఈ క్రమంలో బంగారు, వజ్రాభరణాల పెట్టె కనిపించలేదని హోటల్‌ సిబ్బందికి చెప్పి వెళ్లి, సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌లో దిగారు. మాయమైన పెట్టెలో విలువైన వజ్రాభరణాలు, బంగారు గొలుసు, పెండెంట్‌.. ఉన్నట్లు ఈనెల 1న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు.. బంజారాహిల్స్‌ ఠాణాకు బదిలీ చేశారు. మంగళవారం డీఐ మహ్మద్‌ హఫీజుద్దీన్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో పరిశీలించారు. సీసీ ఫుటేజీల్లో అహ్మద్‌ బేగ్‌తో పాటు వచ్చిన మహిళ లిఫ్టు సమీపంలో గోడ వద్ద ఫోన్‌ ఉన్న బల్లపై ఆ పెట్టె ఉంచినట్లు గుర్తించారు. పెట్టెలో అన్ని ఆభరణాలు ఉండటంతో అహ్మద్‌ బేగ్‌ను సంప్రదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇన్ని రోజులు ఆ పెట్టను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. గోడ, ఆభరణాల పెట్టె ఒకే రంగులో ఉండడమే దీనికి కారణమని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని