logo

నీట మునిగి ముగ్గురి దుర్మరణం

వేర్వేరుగా చోటు చేసుకున్న ఘటనల్లో నీట మునిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జలపాతంలో మునిగి ఇద్దరు స్నేహితులు మృతి చెందగా.. పార్కు వద్ద ఉన్న కొలనులో ఒక బాలుడు దుర్మరణం చెందాడు. వారి ఇద్దరి వృత్తులు, కులమతాలు వేరైనా ప్రాణస్నేహితులు.

Published : 05 Oct 2022 03:10 IST

జలపాతంలో దిగి ఇద్దరు యువకులు.. కొలనులో పడి బాలుడు..

శంషాబాద్‌, మెహిదీపట్నం, న్యూస్‌టుడే: వేర్వేరుగా చోటు చేసుకున్న ఘటనల్లో నీట మునిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జలపాతంలో మునిగి ఇద్దరు స్నేహితులు మృతి చెందగా.. పార్కు వద్ద ఉన్న కొలనులో ఒక బాలుడు దుర్మరణం చెందాడు. వారి ఇద్దరి వృత్తులు, కులమతాలు వేరైనా ప్రాణస్నేహితులు. మృత్యువులోనూ వారి స్నేహ బంధం వీడలేదు. ఈత సరదాకు వారిద్దరూ బలయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన శంషాబాద్‌ పరిధి నానాజీపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌, స్థానికుల కథనం ప్రకారం.. జూకల్‌కు చెందిన కె.మహేశ్‌ చారి(28) కార్పెంటర్‌, ఎండీ. నదీమ్‌(24) బైక్‌ మెకానిక్‌. ఇద్దరు అవివాహితులు. సోమవారం సాయంత్రం ఇద్దరూ నానాజీపూర్‌ జలపాతం వద్దకు వెళ్లారు. నదీంకు ఈత రాకున్నా జలపాతంలోకి దిగాడు. నీటిలో మునిగిపోతుండటంతో గమనించిన మహేశ్‌..  కాపాడడానికి యత్నించాడు. ఈ క్రమంలో మహేశ్‌ను నదీం గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు మునిగిపోయారు. తమ కుమారులు రాత్రి ఇంటికి రాకపోవడంతో జలపాతం వద్ద మంగళవారం ఉదయం పరిశీలించగా బైక్‌, ఇద్దరి దుస్తులు, చరవాణులు ఉన్నాయి. పోలీసుల సహాయంతో స్థానికులు జలపాతంలో గాలించగా ఇద్దరి మృతదేహాలు దొరికాయి.

ఒక్కడే కుమారుడు.. మృతుడు మహేశ్‌ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. అతనికి నలుగురు అక్కలు ఉన్నారు. వారి వివాహాలు  అయ్యాయి.మహేశ్‌కు పెళ్లిసంబంధాలు చూస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మరో మృతుడు నదీం కుటుంబంలో చిన్నవాడు. అతనికి సంబంధాలు చూస్తున్నారు. సరదాగా బయటకు వెళ్లిన కుమారులు విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

పుట్టిన రోజున శవమై తేలిన బాలుడు.. మాసాబ్‌ట్యాంక్‌, ఏసీగాడ్స్‌లోని సైఫాబాద్‌ లైన్సులో ఉండే రజియా బేగం భర్త సయ్యద్‌ అలీ మూడేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు అయిదుగురు సంతానం. రెండోవాడైన మహ్మద్‌ అలీ(9) పుట్టిన రోజు ఈనెల 4న జరగాల్సి ఉంది. తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, పొరిగింటివారితో కలిసి మహ్మద్‌ అలీ సోమవారం సాయంత్రం మాసాబ్‌ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్కుకు వెళ్లాడు. తోటి వారితో ఆడుకుంటున్న మహ్మద్‌ అలీ కనిపించకుండా పోయాడు. సోమవారం రాత్రి ఫిర్యాదు అందడంతో పోలీసులు బాలుడి కోసం గాలించారు. మంగళవారం ఉదయం పార్కులోని కొలనులో  బాలుడి మృతదేహం గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు హుమాయున్‌నగర్‌ ఎస్సై రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని