logo

పర్యావరణహితం.. ఈ కుర్రాడి అభిమతం

తెల్లవారుజాము..నాలుగున్నర గంటలు.. నెక్లెస్‌రోడ్డులో వాకింగ్‌కు ఒక్కొక్కరు వస్తున్నారు.. అదే సమయంలో ఓ 18 ఏళ్ల బాలుడు ‘సోలో’ ఆందోళన.. పర్యావరణాన్ని కాపాడాలి.. అంటూ రాసి ఉన్న పోస్టర్లు ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు.

Published : 05 Oct 2022 03:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెల్లవారుజాము..నాలుగున్నర గంటలు.. నెక్లెస్‌రోడ్డులో వాకింగ్‌కు ఒక్కొక్కరు వస్తున్నారు.. అదే సమయంలో ఓ 18 ఏళ్ల బాలుడు ‘సోలో’ ఆందోళన.. పర్యావరణాన్ని కాపాడాలి.. అంటూ రాసి ఉన్న పోస్టర్లు ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అటుగా వెళ్లే వాకర్లు ఎంతో ఆసక్తిగా గమనించడం ప్రారంభించాడు. ఆ కుర్రాడి పేరు రుచిత్‌ ఆశాకమల్‌. ఉప్పల్‌కు చెందిన రుచిత్‌ ప్రస్తుతం నిజాం కళాశాలలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. పర్యావరణ మార్పులపై ఒంటరి పోరాటం చేపట్టాడు. స్వీడన్‌కు చెందిన గ్రెటాథన్‌బర్గ్‌ స్ఫూర్తితో ఒంటరి పోరుకు శ్రీకారం చుట్టాడు. ఇతనికి ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యుచర్‌(ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)-హైదరాబాద్‌ సంస్థ అండగా నిలిచింది. గ్లోబల్‌ క్లైమైట్‌ స్ట్రైక్‌లో భాగంగా  నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌పై ‘సోలో స్ట్రైక్‌’ నిర్వహించి  అవగాహన కల్పిస్తున్నాడు.

స్వతహాగా‘టీన్‌ యాక్టివిజం’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ యువత హక్కులు, మహిళా సాధికారిత కోసం కృషి చేస్తోంది. సైదాబాద్‌లో బాలికపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బాలిక హక్కుల కోసం 4వేల పిటిషన్లు ఐక్యరాజ్య సమితికి పంపించారు. పీర్జాదిగూడలో  ఓ చెరువును శుభ్రం చేసే  పనిని భుజానికెత్తుకోగా.. .  అధికారులు స్పందించి నిధులు కేటాయించారు.

మా భవిత కోసం చేస్తున్న ప్రచారం: రుచిత్‌

ఎనిమిదో తరగతిలో ‘జంతువుల ప్రవర్తన’ అనే పాఠం చదువుకున్నా. అప్పటి వరకు మనుషులే గొప్ప అనుకున్నా. జంతువులకు కూడా మానవత్వం, భావోద్వేగాలు ఉంటాయని తెలిసి నాలో పర్యావరణం, జంతువులపై ప్రేమాభిమానం ఏర్పడింది.  వందల ఏళ్ల నాటి మర్రిచెట్లు నరికివేస్తున్నారు. ప్రతి వ్యక్తి పర్యావరణంపై అవగాహన కల్పించాలనేది నా అభిమతం. గ్లోబల్‌ క్లైమైట్‌ స్ట్రైక్‌ అంటే ఎవరికీ వ్యతిరేకం కాదు.. మా భవిష్యత్తు కోసం మేం చేస్తున్న ప్రచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని