logo

నకిలీ ప్రతినిధులు.. నయా మోసం

ఆన్‌లైన్‌లో నకిలీ కాల్‌సెంటర్‌ నంబరు ఉంచి ఫోన్లు స్వీకరిస్తూ తామే ఆయా బ్రాండ్ల ప్రతినిధులమంటూ సర్వీసింగ్‌ చేసి అధికంగా వసూలు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు.

Published : 05 Oct 2022 03:23 IST

ప్రముఖ సంస్థల పేర్లతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన ఇద్దరి అరెస్టు  


ముఠా వద్ద స్వాధీనం చేసుకున్న చరవాణులను పరిశీలిస్తున్న నగర సంయుక్త సీపీ గజరావు భూపాల్‌, నగర సైబర్‌ క్రైం సెల్‌ ఏసీపీ ప్రసాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో నకిలీ కాల్‌సెంటర్‌ నంబరు ఉంచి ఫోన్లు స్వీకరిస్తూ తామే ఆయా బ్రాండ్ల ప్రతినిధులమంటూ సర్వీసింగ్‌ చేసి అధికంగా వసూలు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ముంబయి, నోయిడా, బెంగళూరు తదితర నగరాల్లో మోసాలు చేస్తున్న ఈ ముఠాలోని ఇద్దరు ప్రధాన సూత్రధారుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 555 ఫోన్లు, 1000 సిమ్‌కార్డులు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ గజరావు భూపాల్‌ మంగళవారం కేసు వివరాలను విలేకర్లకు తెలిపారు.

హైదరాబాద్‌ కేంద్రంగా

నగరానికి చెందిన మహ్మద్‌ సలీమ్‌, మహ్మద్‌ ఆరిఫ్‌లు రామంతాపూర్‌లోని కూర్మనగర్‌లో స్కైలైన్‌ కస్టమర్‌ కేర్‌, సర్వీసింగ్‌ సెంటర్‌, గ్లోబల్‌ టెక్నో సర్వీస్‌ పేరిట నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రముఖ బ్రాండ్ల గృహోపకరణాల మరమ్మతులకు సర్వీసు చేస్తామంటూ గూగుల్‌లో ప్రకటనలు గుప్పించారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ముంబయి, నొయిడా, బెంగళూరు సహా కొన్ని నగరాల్లోని వినియోగదారులు గూగుల్‌లో వెతగ్గానే తొలుత ముందు వీళ్ల నంబరు కనిపించేలా చేశారు. వినియోగదారులు కాల్‌ చేసినప్పుడు రామంతాపూర్‌లోని కూర్మనగర్‌లో ఉండే టెలీకాలర్లు స్వీకరించి మాట్లాడేవారు. ఇతర నగరాల్లో టెక్నీషియన్స్‌, సర్వీస్‌ ఏజెంట్లను నియమించుకున్నారు. వినియోగదారుల నుంచి ఫోన్‌ రాగానే ఆయా నగరాల్లోని అసలైన బ్రాండ్‌ ప్రతినిధుల పేరిట తమ టెక్నీషియన్స్‌ను పంపిస్తున్నారు. చిన్న మరమ్మతు అయినా రూ.2,500 నుంచి రూ.5 వేల వరకూ సగటున 60 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. మరమ్మతు చేయకపోయినా కనీసం ఛార్జీ రూ.300 తీసుకుంటున్నారు. ఇలా నాలుగేళ్లుగా దందా నడిపించారు. రామంతాపూర్‌లోని కాల్‌సెంటర్‌ నుంచి రోజుకు సుమారు 500 వరకూ కాల్స్‌ స్వీకరిస్తున్నారు. రోజూ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఆర్జిస్తున్నారు. నకిలీ కాల్‌ సెంటర్‌ కోసం రామంతాపూర్‌లో ఏకంగా అపార్టుమెంటు కట్టినట్లు సమాచారం. ఓ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ముఠా వ్యవహారం వెలుగు చూసింది.  

గూగుల్‌ను ఎలా ఏమారుస్తారంటే..?

బ్రాండెడ్‌ సంస్థల స్థానంలో తమ కాల్‌సెంటర్‌కు ఫోన్లు వచ్చేందుకు ఇద్దరు నిందితులు గూగుల్‌ ప్రకటనల్ని తెలివిగా ఏమార్చారు. గూగుల్‌లో తమ కాల్‌సెంటర్‌ నంబర్లకు వారి సిబ్బందితో ఎక్కువ క్లిక్కులు, హిట్లు ఇప్పించారు. గూగుల్‌లో వివిధ బ్రాండ్ల కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతగ్గానే.. అవే బ్రాండ్ల పేర్లతో ఉండే ఈ ముఠా నంబరు ముందు కన్పిస్తోంది. ఎలక్ట్రానిక్‌ వస్తువులు మరమ్మతుకు గురైతే ఆయా బ్రాండ్లకు చెందిన అసలైన వెబ్‌సైట్లలోని నంబర్లను సంప్రదించాలని సంయుక్త సీపీ సూచించారు. సమావేశంలో సీసీఎస్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ డి.దస్రూ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని