logo

పూల రైతులకు పండగ

 వర్షాలకు పూల తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు దసరా పండగ కాస్త ఊరటనిచ్చింది. మళ్లీ కార్తీక మాసం వచ్చే వరకూ పూలకు గిరాకీ లేకపోయినా.. దసరా పండగతో వారికి కాస్త వెసులుబాటు కలిగిందని పలువురు కమీషన్‌ ఏజెంట్లు చెబుతున్నారు.

Published : 05 Oct 2022 03:23 IST

గుడిమల్కాపూర్‌ మార్కెట్లో పూల కొనుగోలుదారులు

ఈనాడు, హైదరాబాద్‌:  వర్షాలకు పూల తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు దసరా పండగ కాస్త ఊరటనిచ్చింది. మళ్లీ కార్తీక మాసం వచ్చే వరకూ పూలకు గిరాకీ లేకపోయినా.. దసరా పండగతో వారికి కాస్త వెసులుబాటు కలిగిందని పలువురు కమీషన్‌ ఏజెంట్లు చెబుతున్నారు. గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు గతేడాది.. 150- 200 టన్నుల పూలు రాగా.. ఈ ఏడాది కేవలం 100 టన్నులే వచ్చాయి. ఇదే పరిస్థితి మిగతా పూల మార్కెట్లలోనూ  కనిపించింది. పూల దిగుబడి తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో గతేడాది కిలో బంతి మేలురకం రూ. 40-50 ఉంటే.. ఈ ఏడాది కిలో రూ.70-80 వరకూ పలికింది. రిటైల్‌కు వచ్చేసరికి కిలో బంతిపూలు రూ.130-150 చొప్పున అమ్ముతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లో చామంతి రూ.260-300,  గులాబీ రూ.200-250, కనకాంబరాలు రూ.800-1000, మల్లెపూలు రూ.500- 600 కిలో చొప్పున విక్రయించారు. మంగళవారం గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు దాదాపు 125 టన్నుల బంతిపూలు వచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి పూలన్నీ అమ్ముడవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మిగతా పూలు అన్ని రకాలు 90 టన్నుల వరకూ ఉంటాయని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి అపర్ణ చెప్పారు.

రహదారుల పక్కన రాశులుపోసి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు..కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున బంతి, చామంతి పూలు దిగుమతి అయ్యాయి. పూలు అమ్మకానికి వచ్చిన వాహనాలతో పాటు.. కొనుగోలుదారులతో గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ పరిసరాలు కిటకిటలాడాయి. దీంతో కొంతమంది రైతులు రోడ్డు పక్కనే రాశులుగా పోసి అమ్ముతున్నారు. దండలు కట్టి.. మూర బంతిపూలు రూ.20కి తక్కువ లేకుండా అమ్ముతున్నారు. విడి పూలు మాత్రం కిలో రూ.150 వరకూ అమ్మేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts