logo

ఉగ్ర ముఠాలు.. ఎన్నో ఘోరాలు

పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరాన్ని అబ్దుల్‌ జాహెద్‌ ముఠా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. దేశంలో ఎక్కడ బాంబుపేలుళ్లు సంభవించినా లింకులు హైదరాబాద్‌లో బయటపడుతుంటాయి. అంతటి కరడు గట్టిన ఉగ్రవాదులకు నగరం కేంద్రంగా మారటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 05 Oct 2022 03:25 IST
నగరం కేంద్రంగా కార్యకలాపాలు
దేశంలో ఎక్కడ పేలుడు జరిగినా లింకులు
ఈనాడు, హైదరాబాద్‌

దేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరాన్ని అబ్దుల్‌ జాహెద్‌ ముఠా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. దేశంలో ఎక్కడ బాంబుపేలుళ్లు సంభవించినా లింకులు హైదరాబాద్‌లో బయటపడుతుంటాయి. అంతటి కరడు గట్టిన ఉగ్రవాదులకు నగరం కేంద్రంగా మారటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 30 ఏళ్ల క్రితమే పడిన ఉగ్రబీజం ఇన్నేళ్లలో వటవృక్షంగా మారింది. ప్రస్తుతం నగరంలో మతఘర్షణలు సృష్టించేందుకు సిద్ధపడిన ఉగ్రముఠా నాయకుడు అబ్దుల్‌ జాహెద్‌ ముందు.. నాలుగైదు ముఠాలు సాగించిన ఉగ్రకార్యకలాపాలు.. పాల్పడిన ముఠాల గురించి పోలీసులు పలు అంశాలను తాజా రిమాండ్‌ రిపోర్టులో ఉంచారు.  

మొదలైంది అలా..

1993 బాబ్రీమసీదు ఘటనతో యావత్‌ భారతం అట్టుడికింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు అప్పుడే నల్గొండకు చెందిన ఫసీయుద్దీన్‌ ముఠాను రూపొందించి ఉగ్రవాద చర్యలకు బీజం వేశాడు. ఫర్హతుల్లాఘోరీ, జకీర్‌ రహీమ్‌, నజీర్‌ అహ్మద్‌ ఫరూఖీ, సాదిక్‌ బిన్‌ ఉస్మాన్‌, అసదుల్లాఖాన్‌, ముక్తేదిర్‌, అజీయుద్దీన్‌ షేక్‌, ఫసీయుద్దీన్‌, మిర్‌ అహ్మద్‌ అలీ, మహ్మద్‌ రఫీక్‌ ఫసీ ముఠాగా మారారు. 5 హత్యలు, 1 హత్యాప్రయత్నం, 10కు పైగా దోపిడీలు దొంగతనాలతో భయానక వాతావరణం సృష్టించారు. కార్ఖానా ఠాణా పరిధిలో జరిగిన కాల్పుల్లో మిర్‌ అహ్మద్‌ అలీ, మహ్మద్‌ రఫీక్‌ మరణించారు. అనంతరం మిగిలిన ముఠా సభ్యులు రియాద్‌ పారిపోయారు. వారిలో పర్హతుల్లాఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్‌ నుంచి ఉగ్ర కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నాడు. ఆ తర్వాత అజంఘోరీ లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొంది నగరం చేరాడు. ఇండియన్‌ ముస్లిం మహ్మదీ ముజాహిదీన్‌(ఐఎంఎంఎం) సంస్థ ఏర్పాటు చేశాడు. నగరం సహా పలు ప్రాంతాల్లో యువకులను ఎంపిక చేశాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన నిధుల కోసం సుపారీ హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేశారు. నవీపేట్‌లో పెట్రోల్‌బంకు దోపిడీ, యజమాని కృష్ణమూర్తి హత్య, విజయవాడలలో ఆర్‌ఎంపీ కాటంరాజు లక్ష్మినారాయణ సుపారీ హత్యలు, సికింద్రాబాద్‌, మెట్‌పల్లి, నాందేడ్‌ తదితర చోట్ల అశ్లీల చిత్రాలు ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలపై సినిమా థియేటర్లలో బాంబులు పేల్చారు. అజంఘోరి 2002 పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. షాహిద్‌ బిలాల్‌ హుజీ ఉగ్రవాద సంస్థ పేరుతో కార్యకలాపాలు సాగించాడు. బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థల అండదండలతో ముఠాను ఏర్పాటు చేశాడు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు ప్రయోగించాడు. ఆయుధాలతో విధ్వంసం సృష్టించే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌. దీనికి ముజీబ్‌ సోదరుడు సారథ్యం వహించాడు. అతడు ఎన్‌కౌంటర్‌లో మరణించాక ముజీబ్‌ సోదరుడు బాధ్యతలు తీసుకున్నాడు. టోలిచౌకిలో ఉన్న ఇతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ కేసులో అరెస్టయి క్షమాభిక్షతో బయటకు వచ్చాడు. 2006లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలతో పట్టుబడటంతో న్యాయస్థానం జీవితఖైదు శిక్ష విధించింది.

ఉగ్రమూకల హత్యలు.. దోపిడీలు

లష్కరేతోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, హర్హత్‌ హుల్‌ జిహాద్‌ హల్‌ ఇస్తామీ(హుజీ), బాబ్రీమసీద్‌ తెహాఫుజ్‌ కమిటీ, ఇండియన్‌ ముస్లిం మహ్మదీ ముజాహిదీన్‌, తెహ్రీ గల్బా హే ఇస్లామీ తదితర సంస్థలు నగరంలో ప్రాణం పోసుకొని దేశవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసు కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని