Telangana News: బీఆర్‌ఎస్‌.. రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే: లక్ష్మణ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ అంటూ ఇవాళ ప్రకటించిన బీఆర్‌ఎస్‌పై భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తెరాసకు నూకలు చెల్లాయి...

Published : 06 Oct 2022 01:52 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ అంటూ ఇవాళ ప్రకటించిన బీఆర్‌ఎస్‌పై భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తెరాసకు నూకలు చెల్లాయి... అందుకే బీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారని విమర్శించారు. తెరాస 8ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలన్నారు. యావత్‌ రాష్ట్రాన్ని బ్యాంకులు, కార్పొరేషన్లకు కుదువపెట్టిన కేసీఆర్‌.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్‌ఎస్‌ విధానమా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్‌ఎస్‌ సిద్ధాంతమా? లిక్కర్‌ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్‌ ఆదర్శమా? అని నిలదీశారు. రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్‌ దేశానికి ఆదర్శమా? ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న 317 జీవోను దేశమంతా విస్తరింపజేస్తారా? అని ఎద్దేవా చేశారు.

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేయడమే బీఆర్‌ఎస్‌ లక్ష్యమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మునుగోడు ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించే ఉద్దేశంతో కేసీఆర్‌ చేస్తున్న విన్యాసాలు ప్రజలకు అర్థమయ్యాయని పేర్కొన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ఖాయమన్నారు. గుడి సొమ్ము, బడి సొమ్మును దిగమింగడం, డిస్కంలను నిండా ముంచడమే దేశానికి ఆదర్శమా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌.. రాజకీయ పునరేకీకరణ కాదని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమేనని లక్ష్మణ్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని