logo

దసరా ముగిసినా.. దోపిడీ ఆగలే!

రాజధానికి చెందిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు దసరా పండుగ తర్వాత కూడా టిక్కెట్ల ధరల దోపిడీని ఆపడం లేదు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటికీ విమానం టిక్కెట్‌ రేట్లతో సమానంగా రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు.

Updated : 07 Oct 2022 04:42 IST

విమానం టిక్కెట్ల ధరతో పోటీపడుతున్న ప్రైవేటు బస్సు టిక్కెట్ల రేట్లు

పండగకు సొంతూరు వెళ్లిన వారు తిరిగొచ్చేందుకు తిప్పలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధానికి చెందిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు దసరా పండుగ తర్వాత కూడా టిక్కెట్ల ధరల దోపిడీని ఆపడం లేదు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటికీ విమానం టిక్కెట్‌ రేట్లతో సమానంగా రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు సాధారణ రోజుల్లో రూ.800 ఉండే టిక్కెట్‌ ధర ఈనెల 9న వచ్చేందుకు బుక్‌ చేసుకుంటే ఏకంగా రూ.3200 వసూలు చేస్తున్నారు. మిగిలిన చోట్ల నుంచి కూడా రాజధానికి వచ్చే ప్రయాణికుల దగ్గర ఇలానే టిక్కెట్ల దోపిడీకి పాల్పడుతున్నారు.

శని, ఆదివారాల్లో అధిక డిమాండ్‌..

దసరాకు ఒకరోజు ముందు వరకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి దాదాపు పది లక్షలమంది ప్రయాణికులు సొంత ప్రాంతాలకు వెళ్లారు. ఈ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ప్రైవేటు బస్సుల యజమానులు మూడింతల మేర టిక్కెట్‌ రేట్లను పెంచి  దోచుకున్నారన్న విమర్శలు రేగాయి. పండుగ ముగిసింది.. దోపిడీకి అడ్డుకట్టపడుతుందని అంతా భావించారు. పండగకు నగరం నుంచి ఊళ్లకు వెళ్లిన వారు, నగరానికి వచ్చిన వారు శని, ఆదివారాల్లో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఆదివారం బస్సులకు డిమాండ్‌ అధికంగా ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు బస్సు యజమానులు ప్లెక్సీపేర్‌ పేరుతో టిక్కెట్‌ రేట్లను పెంచేశారు. ఆదివారం సాయంత్రం బయలుదేరే బస్సుల్లో  రేట్లను పెంచారు. ప్రధానంగా స్లీపర్‌ సీట్లకు అధిక డిమాండ్‌ ఏర్పడింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు స్లీపర్‌ టిక్కెట్‌ ధర రూ.800 వరకు ఉండేది. అదే ఇప్పుడు గురువారం రాత్రి నాటికి దీని ధర రూ.3200 వరకు ఉంది. శనివారం రాత్రి నాటికి  ఇదే రూటులో టీఎస్‌ఆర్టీసీ గరుడ ప్లస్‌ బస్సులో దీని ధర రూ.1200 వరకు ఉంది. ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం.. వాటిలో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులపై పడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు కూడా టిక్కెట్‌ ధర రూ.3500 వరకు పలుకుతోంది. ఏపీ నుంచి ఆదివారం బయలుదేరే వారి సంఖ్య భారీగానే ఉంది. దీంతో ఏపీ నగరాల నుంచి ప్రైవేటు బస్సులకు డిమాండ్‌  అధికంగా ఉంది. విశాఖపట్నం నుంచి సాధారణ రోజుల్లో రూ.1200 వరకు స్లీపర్‌ టిక్కెట్‌ ధర ఉంటే అదే వచ్చే ఆదివారం ధర రూ.2900 వరకు ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. నాన్‌ఏసీ బస్సుల్లో టిక్కెట్‌ రేట్లు కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఒక్క విశాఖపట్నం నుంచే కాకుండా కాకినాడ, అమలాపురం, భీమవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర అన్ని నగరాలు/పట్టణాల నుంచి ఇలానే టిక్కెట్‌ రేట్లు మూడింతలు అధికంగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు కిమ్మనడం లేదు. ప్రైవేటు నుంచి అందుతున్న ముడుపుల వల్లే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని