logo

Hyderbad: హైదరాబాద్‌ శివారులో స్టేషన్లున్నా.. ఆగని రైళ్లు

నగర శివారులో చాలా రైల్వే స్టేషన్లున్నాయి. ఆ స్టేషన్లలోనూ దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆగితే వేల మంది ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుంది. కానీ ఆగకపోవడంతో ప్రయాణికులు ప్రధాన స్టేషన్లకు వెళ్తుండటంతో అక్కడ ఒత్తిడి పెరుగుతోంది.

Updated : 07 Oct 2022 08:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారులో చాలా రైల్వే స్టేషన్లున్నాయి. ఆ స్టేషన్లలోనూ దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆగితే వేల మంది ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుంది. కానీ ఆగకపోవడంతో ప్రయాణికులు ప్రధాన స్టేషన్లకు వెళ్తుండటంతో అక్కడ ఒత్తిడి పెరుగుతోంది. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ దూరప్రాంతాల రైళ్లను ఎందుకు ఆపరో అర్థం కావడం లేదని జంటనగరాల ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి నూర్‌మహ్మద్‌ అన్నారు. ఇదే పరిస్థితి మల్కాజిగిరి, మౌలాలి స్టేషన్లదన్నారు.

వికారాబాద్‌ వరకూ ఉత్తిగనే.. గతంలో గౌతమి ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌ నుంచి నడిపేవారు. ఆ రైలును లింగంపల్లి రైల్వేస్టేషన్‌ యార్డులో ఆపేవారు. ఇప్పుడు ఆ రైలును లింగంపల్లి నుంచి ప్రారంభించారు. దీంతో లింగంపల్లి, బేగంపేటలో ఆగుతుండంతో సగానికి సగం మంది ప్రయాణికులు ఈ రెండు స్టేషన్లలోనే ఎక్కేస్తున్నారు. ఇదే పరిస్థితి విశాఖ, కోకనాడ, జన్మభూమి, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ఉండేది. ఇప్పుడవన్నీ లింగంపల్లి, బేగంపేటలో ఆపడంతో చాలామంది ఈ స్టేషన్లలోనే ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రైళ్లలో సగానికిపైగా వికారాబాద్‌ యార్డులో ఆగుతున్నాయి. మరో 4 రైళ్లు కూడా వికారాబాద్‌ యార్డులో ఆపుతున్నారు. ఇలా దాదాపు 9 రైళ్లు వికారాబాద్‌ వరకూ వెళ్తున్నాయి. అక్కడి నుంచే ప్రారంభమౌతున్నాయి. ఈ రైళ్లు వికారాబాద్‌లోనే ప్రయాణికులను ఎక్కించుకుంటే శివార్లలో ఉన్న ఎంతోమందికి ఎంఎంటీఎస్‌ లేదనే లోటు లేకుండా రాకపోకలు సాగించొచ్చు.

* నగరం నుంచి రోజూ రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు: 270.

* సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్ల నుంచి: 255 రైళ్లు.

* రోజూ రైళ్లలో వెళ్లే ప్రయాణికుల సంఖ్య: 1.90 లక్షలు.

* లింగంపల్లి, బేగంపేట నుంచి బయల్దేరే రైళ్లు: 15.

* వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ యార్డు వరకూ వెళ్తున్నవి: 9

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని