logo

వీధి దీపం.. ఉసయోగాలు అనేకం!

ఒక వీధి దీపం ఏం చేస్తుంది? వెలుతురునిస్తుందని అంటారా.! గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో వీధి దీపాలు వెలుగునివ్వడమే కాదు.. ‘స్మార్ట్‌’గానూ పనిచేస్తాయి. గాలి, నీటి నాణ్యత, వాతావరణ పరిస్థితులు, ఇంధన వనరుల వినియోగం వంటి సమాచారం సేకరించి అందిస్తాయి.

Published : 18 Oct 2022 04:17 IST

వై-సన్‌ సాంకేతికతతో అనుసంధానం
ట్రిపుల్‌ఐటీలో స్మార్ట్‌ వీధి దీపాల వ్యవస్థ ఏర్పాటు


సాంకేతికత ఆవిష్కరించిన సందర్భంగా ఆచార్యులు

ఈనాడు, హైదరాబాద్‌: ఒక వీధి దీపం ఏం చేస్తుంది? వెలుతురునిస్తుందని అంటారా.! గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో వీధి దీపాలు వెలుగునివ్వడమే కాదు.. ‘స్మార్ట్‌’గానూ పనిచేస్తాయి. గాలి, నీటి నాణ్యత, వాతావరణ పరిస్థితులు, ఇంధన వనరుల వినియోగం వంటి సమాచారం సేకరించి అందిస్తాయి. ఈ సమాచార సేకరణకు మరింత సాంకేతికత హంగులద్దుతూ స్మార్ట్‌ వీధి దీపాలను ‘వై-సన్‌’ నెట్‌వర్క్‌తో ట్రిపుల్‌ ఐటీ అనుసంధానించింది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

వై-సన్‌ స్మార్ట్‌ వీధి దీపాలు

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ, జాతీయ స్మార్ట్‌సిటీస్‌ మిషన్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ట్రిపుల్‌ ఐటీలో స్మార్ట్‌సిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది. దీనికి యూరోపియన్‌ వాణిజ్య సాంకేతిక మండలి(ఈబీటీసీ) సాంకేతిక సహకారం అందిస్తుండగా సిలికాన్‌ ల్యాబ్స్‌, ఇంటెల్‌, సెయింట్‌ గోబెన్‌ కార్పొరేట్‌ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రాజెక్టులో భాగంగా విద్యుద్దీప స్తంభాలకు ప్రత్యేకంగా సెన్సర్లు అమర్చి వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. కెమెరా, స్పీకర్‌ను అమర్చి ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ పరిస్థితులను సైతం అంచనా వేసి ప్రదర్శించడం, ప్రకటిస్తున్నారు. ఇప్పుడు వీధి దీపాలను వై-సన్‌ స్మార్ట్‌ వీధి దీపాలుగా మార్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సైతం పరీక్షించి విజయవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ‘‘స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌లో భాగంగా ట్రిపుల్‌ ఐటీలో నీరు, విద్యుత్తు సరఫరా, గాలి కాలుష్యం, సౌర విద్యుదుత్పత్తి వంటివి సెన్సర్‌ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వై-ఫై, లోరా వ్యాన్‌ సాంకేతికతకుతోడుగా వై-సన్‌ సాంకేతికత పనిచేస్తుంది.’’ అని ట్రిపుల్‌ఐటీ కో ఇన్నొవేషన్‌ ఆచార్యుడు రమేశ్‌ లోగనాథన్‌ చెప్పారు.

వై-సన్‌ సాంకేతికతతో పనిచేస్తున్న వీధి దీపం

ఏమిటీ సాంకేతికత..?

వై-సన్‌(వైర్‌లెస్‌ స్మార్ట్‌ యుబిక్విషస్‌ నెట్‌వర్క్స్‌) సాంకేతికతను సిలికాన్‌ ల్యాబ్‌ రూపొందించింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) పరిజ్ఞానంతో పనిచేస్తుంది. వై-ఫైతో పోల్చితే తక్కువ వేగంతో పనిచేసినా, తక్కువ విద్యుత్తు వినియోగం, స్థిరమైన కనెక్షన్‌, ఎక్కువ పరికరాలకు అనుసంధానించే లక్షణం ఉంది. ఈ నెట్‌వర్క్‌లో వాడే ప్రతి సెన్సర్‌ నోడ్‌ ఒక రౌటర్‌గా పనిచేస్తుంది. తొలివిడతగా క్యాంపస్‌లోని 30 స్తంభాలకు సెన్సర్‌నోడ్స్‌ ఏర్పాటుచేసి క్లౌడ్‌ సాంకేతికతతో వీధి దీపాల వ్యవస్థను నియంత్రిస్తున్నారు. ఈ సాంకేతికతతో అనుసంధానమైన ఇతర ఐవోటీ పరికరాలను సైతం క్లౌడ్‌తో అనుసంధానించే వీలవుతోందని వర్సిటీ ఆచార్యుడు అఫ్తాబ్‌ హుస్సేన్‌ వివరించారు. నోడ్స్‌(సెన్సర్లు) మధ్య అనుసంధానంతో సమాచార వ్యాప్తి జరుగుతుందని లివింగ్‌ ల్యాబ్‌ లీడ్‌ ఆర్కిటెక్ట్‌ వట్టెం అనూరాధ చెప్పారు. టవర్లు, ఖరీదైన సమాచార సాంకేతికత వాడకుండా సెన్సర్లతో నేరుగా క్లౌడ్‌తో అనుసంధానమయ్యే వీలుంటుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని