logo

DAV School: యాజమాన్యాన్ని మార్చండి.. పాఠశాల నడపండి

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయని పాఠశాల గుర్తింపు రద్దు చేస్తే అక్కడ విద్యనభ్యసించే వేల మంది పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 23 Oct 2022 08:37 IST

డీఏవీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల వేడుకోలు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయని పాఠశాల గుర్తింపు రద్దు చేస్తే అక్కడ విద్యనభ్యసించే వేల మంది పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాలలో అమానవీయ ఘటన నేపథ్యంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. శనివారం పాఠశాల వద్దకు పలువురు తల్లిదండ్రులు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. పాఠశాల గుర్తింపు రద్దు వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. యాజమాన్యాన్ని మార్చి పాఠశాల నడిపించాలని కోరారు. ప్రాంగణంలో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు వెంటనే తెలిసేలా వ్యవస్థ ఏర్పాటు కావాలన్నారు. పిల్లల్ని ఇతర పాఠశాలల్లో చేరుస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వారు స్పందిస్తూ.. వేరే స్కూల్‌కు మారిస్తే అక్కడ స్టేట్‌ సిలబస్‌ ఉంటుందని, ఇప్పటి వరకు సీబీఎస్‌ఈలో చదివిన వారు ఇబ్బంది పడతారన్నారు. తాను ఇదే పాఠశాలలోనే చదివానని, నాటి ఉపాధ్యాయులు ఇంకా ఉన్నారన్నారు. అందర్నీ తప్పు పట్టలేమని, కొందరు చేసిన దానికి అందర్నీ ఇబ్బంది పెట్టవద్దన్నారు. 26వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి  బృందంగా ఏర్పాటై చర్చిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని