logo

భర్త కిడ్నాప్‌.. రెండో భార్యపై కేసు: వేధిస్తున్నారంటూ మాత్రలు మింగిన మహిళ

పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఓ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైంది.

Updated : 31 Oct 2022 09:30 IST


హుస్నా బేగం

ఈనాడు, హైదరాబాద్‌; చార్మినార్‌, మొఘల్‌పుర, న్యూస్‌టుడే: పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఓ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైంది. జులై 2022లో పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఉమేద్‌ అబ్దుల్లా కనిపించటం లేదంటూ ఆయన మొదటి భార్య చార్మినార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్లాను గుర్తించారు. తనను రెండో భార్య హుస్నా బేగం, మరో ఇద్దరు వ్యక్తులు అపహరించినట్టు తెలిపాడు. మిస్సింగ్‌ కేసును కిడ్నాప్‌ కేసుగా మార్చారు. అదే నెలలో ఏ2 సోహల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఏ1 హుస్నా బేగం, ఏ3 గుర్తుతెలియని వ్యక్తిని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. హుస్నా బేగం హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. శనివారం ఓ వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై ఆమె చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆమెతోపాటు వచ్చిన వ్యక్తిని ఏ3 నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతని గురించి ఆరా తీశారు. అతడెవరో తనకు తెలియదంటూ ఆమె సమాధానమిచ్చారు. తర్వాత శివరాంపల్లిలోని ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ, ఎస్సైలు తనను వేధించినట్టు ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు సమాచారం. పోలీసులు వేధించారనే ఆరోపణలు అవాస్తవమని, తాము కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని చార్మినార్‌ సీఐ గురునాయుడు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని