logo

Voter List: ముసాయిదా జాబితా విడుదల.. మీ పేరుందా?

అర్హత కలిగిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోల్‌ అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు.

Updated : 10 Nov 2022 08:42 IST

అభ్యంతరాలకు 8 వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 2023 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక సవరిత ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. ప్రధాన నగరంలోని హైదరాబాద్‌ జిల్లా ఓటర్ల సంఖ్య గతంతో పోల్చితే 5శాతం తగ్గింది. ఈ ఏడాది జనవరి నాటికి హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవరాల్లో 43,67,020 మంది ఓటర్లుండగా, అందులోని 2,79,630 గుర్తింపు కార్డులను జీహెచ్‌ఎంసీ తొలగించింది. కొత్తగా 59,575 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. పౌరులు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా, లేవా అనే విషయాన్ని www.nvsp.com, www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని లేని వారు నమోదు చేసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ తెలిపారు. ఈ ముసాయిదాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను డిసెంబరు 8వ తేదీలోగా తెలపాలని, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

శేరిలింగంపల్లిలో అత్యధికం

ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 6,29,036 మంది ఓటర్లుండగా.. ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌లో 6,00,108 మంది ఉన్నారు. మూడు జిల్లాల్లో అత్యల్పంగా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 2,00,893 మంది ఓటర్లు ఉన్నారు.

23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు ముసాయిదా జాబితాను ఈ నెల 23న ప్రచురించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్‌ పంకజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఓటరుగా నమోదుకాని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు.. నవంబరు 23 నుంచి డిసెంబరు 9 వరకు కూడా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇందుకోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంతకంతో కూడిన ధ్రువీకరణపత్రాన్ని దరఖాస్తుకు జతచేసి జిల్లాల సహాయ ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. జూనియర్‌కళాశాలల అధ్యాపకులు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారితో, యూజీ, పీజీ విద్యార్థులకు బోధించేవారు.. యూనివర్సిటీలు నియమించిన నోడల్‌ అధికారి ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఓటరుగా నమోదు కావొచ్చన్నారు. సందేహాలకు 98494 62153, 90009 22878లో సంప్రదించాలని సూచించారు.


ఏడాదికి నాలుగుసార్లు నమోదు


గోడపత్రిక ఆవిష్కరిస్తున్న వికాస్‌రాజ్‌, లోకేష్‌కుమార్‌

ఉస్మానియా యూనివర్సిటీ: అర్హత కలిగిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోల్‌ అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళ సభ కళాశాలలోని ఓటరు నమోదు, ఆధార్‌ కార్డు అనుసంధానంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు దాటిన వారు ఇక నుంచి ఏడాదిలో నాలుగుసార్లు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ల్లో కొత్త వారు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషన్‌ లోకేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని