logo

Hyderabad: ‘రూ.లక్ష కట్టండి.. రూ.4 కోట్లు మీ సొంతం’

‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి.. రోజుకు 2.5 శాతం(రూ.2500) కమీషన్‌ ఇస్తా..! సరిగ్గా 240 రోజుల తర్వాత రూ.4.21 కోట్లు మీ చేతుల్లో పెడ్తా.

Updated : 16 Nov 2022 07:52 IST

గొలుసుకట్టు వ్యాపారంలో విస్తుపోయే మోసాలు


సీసీఎస్‌ కార్యాలయం ఎదుట బాధితులు

ఈనాడు- హైదరాబాద్‌, నారాయణగూడ, చర్లపల్లి, న్యూస్‌టుడే: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి.. రోజుకు 2.5 శాతం(రూ.2500) కమీషన్‌ ఇస్తా..! సరిగ్గా 240 రోజుల తర్వాత రూ.4.21 కోట్లు మీ చేతుల్లో పెడ్తా.. మీరు ఇంకొకర్ని ప్రోత్సహించి డబ్బు పెట్టిస్తే కమీషన్‌కు అదనంగా రూ.700 ఇస్తా..’’ హైదరాబాద్‌ హబ్సిగూడ కేంద్రంగా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో జరిగిన గొలుసుకట్టు మోసంలో మాయగాడు పన్నిన వల. జైళ్ల శాఖ సిబ్బంది, నగరంలోని ఓ జైలులో గతంలో రిమాండ్‌లో ఉన్న వ్యక్తితో కలిసి హబ్సిగూడ కేంద్రంగా సాగించిన చీకటి వ్యాపారం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థ నిర్వాహకుడు సుమారు 9 వేల మంది నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. గుట్టుగా సాగుతున్న ఈ దందాను ‘ఖైదీతో జట్టుకట్టి.. గొలుసుకట్టు వ్యాపారం’’ పేరుతో ఈ నెల 11న ‘ఈనాడు’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. నిర్వాహకులు ఉడాయించేందుకు సిద్ధమయ్యారని కథనంలో పేర్కొనడంతో బాధితులు పెద్దయెత్తున హబ్సిగూడలోని కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. శని, ఆదివారాలు సెలవు నేపథ్యంలో సోమవారం డబ్బంతా డ్రా చేసుకునే అవకాశం ఉందని బుకాయించారు. నిజమేనని నమ్మి బాధితులు ఇంటిబాట పట్టారు. సోమవారం హబ్సిగూడలోని కార్యాలయానికి చేరుకోగానే నిర్వాహకులు ఉడాయించారు. ఏం చేయాలో తెలియని బాధితులు పెద్దయెత్తున తరలొచ్చి నాంపల్లిలోని సీసీఎస్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.  ఈ చీకటి వ్యాపారంలో జైళ్ల శాఖ సిబ్బంది 200 మంది సుమారు రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లోని కారాగారాల్లో సిబ్బంది నుంచి ఉప పర్యవేక్షణాధికారి వరకు డబ్బు కట్టారని తెలిసింది.  మొత్తంగా డబ్బు పెట్టిన వారి సంఖ్య 9 వేల మంది వరకూ ఉంటారని బాధితులు చెబుతున్నారు.  నకిలీ కంపెనీ అధినేత హబ్సిగూడ కార్యాలయంలో బాధితుల్ని నమ్మించేందుకు నిత్యం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లు ఇచ్చేవాడు. ముంబయికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ట్రేడింగ్‌ చేస్తామని కళ్ల ముందే ఉంటామంటూ డబ్బు వసూలు చేశాడు. సొమ్మును యంత్రాలతో లెక్కించేవారని బాధితులు పేర్కొన్నారు. సాయంత్రానికి లెక్కించిన సొమ్మును కట్టలు కట్టి.. సంచుల్లో నింపేసి కార్లలో తరలించేవారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని