logo

Cyber Crime: ఫోన్‌ పోయిందా.. డబ్బు గోవిందా

నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఫోన్‌ ఇటీవల చోరీకి గురైంది. మరుసటి రోజు కొత్త ఫోన్‌ తీసుకుని పాత నంబరుతో ఉండే సిమ్‌ వేసి చూశాక.. బ్యాంకు ఖాతాలోని దాదాపు రూ.25 వేలు మాయమయ్యాయి

Updated : 17 Nov 2022 07:54 IST

యూపీఐ వాలెట్ల నుంచి నగదు కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఫోన్‌ ఇటీవల చోరీకి గురైంది. మరుసటి రోజు కొత్త ఫోన్‌ తీసుకుని పాత నంబరుతో ఉండే సిమ్‌ వేసి చూశాక.. బ్యాంకు ఖాతాలోని దాదాపు రూ.25 వేలు మాయమయ్యాయి. డబ్బు ఎలా పోయిందో తెలుసుకునేందుకు లావాదేవీలు చూడగా యూపీఐ వాలెట్‌ ద్వారా డబ్బు బదలాయించుకున్నట్లు తేలింది. ఖరీదైన స్మార్ట్‌ ఫోన్లు పొతే ఇలా కొత్త సమస్య వచ్చి పడినట్లే. గూగుల్‌పే, ఫోన్‌పే నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ రహస్య కోడ్‌ వంటివి ఫోన్లోని కాంటాక్టు లిస్టు, ఇతర రూపాల్లో భద్రపరచుకున్న వారే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

కొట్టేసిన డబ్బుతో షాపింగులు

సాధారణంగా ఫోన్లు పోయి కొత్త ది కొని పాత నంబరు యాక్టివేషన్‌ చేయించేలోపు సైబర్‌ నేరస్థులు ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ పిన్‌ వంటివి కాంటాక్టు లిస్టులో సేవ్‌ చేసుకోవడంతో నేరగాళ్లకు పని మరింత సులువవుతోంది. మరికొందరు యూపీఐ కోడ్‌గా వరుస నంబరు, పుట్టిన సంవత్సరం, వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు పెట్టుకుంటున్నారు. దీంతో సులువుగా ఛేదించి డబ్బు ఇతర ఖాతాలకు బదలాయించుకుంటున్నారు. కొందరు పెట్రోలు బంకులు, షాపింగ్‌ మాల్స్‌లలో స్కాన్‌ చేస్తున్నారు. ఫోన్లు కొట్టేశాక సైబర్‌ నేరగాళ్లు సిమ్‌ కార్డులతోనూ డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొట్టేసిన ఫోన్‌ నంబరు ఏ బ్యాంకు ఖాతాతో లింక్‌ అయిందో తెలుసుకుని ఫోన్లో దాచుకున్న బ్యాంకు ఖాతా, యూజర్‌ ఐడీ సేకరించి తేలికగా డబ్బు కొట్టేస్తున్నారు.

బ్లాక్‌ చేయండిలా..

* గూగుల్‌పే వినియోగదారులు 18004190157 ద్వారా బ్లాక్‌ చేయాలి.
* ఫోన్‌పే వినియోగదారులు 08068727374 ద్వారా బ్లాక్‌ చేయాలి.
* పేటీఎం వినియోగదారులు 01204456456 ద్వారా బ్లాక్‌ చేయాలి.


అప్రమత్తంగా ఉండాలి

ఫోన్‌ పోయిన వెంటనే యూపీఐ, డబ్బు లావాదేవీలు నిర్వహించే యాప్‌ల నుంచి లాగ్‌అవుట్‌ అవ్వాలి. యూపీఐ, గూగుల్‌పే, ఫోన్‌పే పాస్‌వర్డ్‌ను కాంటాక్టు లిస్టులో సేవ్‌ చేసుకోకూడదు. ఒకవేళ యాప్‌ల నుంచి డబ్బు బదిలీ చేసుకున్నట్లు గుర్తిస్తే వీలైనంత తొందరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

- శ్రీధర్‌,  సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు