logo

వాహన ప్రవాహం

నగరంలో వాహన వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. 2014జూన్‌లో రోజుకు సగటున 800 కొత్త వాహనాలు రిజిస్టర్‌ అవగా గతేడాది జనవరి నుంచి సగటున 1200 రిజిస్టర్‌ అవుతున్నాయి.

Updated : 24 Nov 2022 02:26 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో  75 లక్షలకు చేరిన సంఖ్య

- ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో వాహన వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. 2014జూన్‌లో రోజుకు సగటున 800 కొత్త వాహనాలు రిజిస్టర్‌ అవగా గతేడాది జనవరి నుంచి సగటున 1200 రిజిస్టర్‌ అవుతున్నాయి. కరోనా ప్రభావంతో మధ్యతరగతి ప్రజలు వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలు ద్విచక్రవాహనాలు, కార్ల కొనుగోళ్లకు రుణాలిస్తుండడంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. ఫలితంగా మొత్తం వాహనాల సంఖ్య ఈ ఏడాది అక్టోబరు నాటికి 75లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక వాహనాలున్న మెట్రో నగరాల జాబితాలో భాగ్యనగరం ఐదో స్థానంలో ఉంది.    

మెట్రోరైలు ఉన్నా ప్చ్‌..

గ్రేటర్‌ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాంలను నియంత్రించేందుకు సర్కార్‌ ఐదేళ్ల క్రితం మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ తగ్గడంతోపాటు అందరూ ప్రజారవాణాపై మొగ్గుచూపుతారని యంత్రాంగం అంచనా వేసింది. ఇందుకు భిన్నంగా మెట్రోరైలు ఉన్నా వ్యక్తిగత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారని కొత్తగా రహదారులపైకి వస్తున్న వాహనాల సంఖ్య చెబుతోంది.


ప్రమాదపు అంచుల్లో ఉన్నాం.
-డాక్టర్‌ కె.ఎం.లక్ష్మణరావు, సమన్వయకర్త సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సెంటర్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌

వాహనాల కాలుష్యం వల్ల ఇప్పటికే మనం ప్రమాదం అంచుల్లో ఉన్నాం. ప్రజా రవాణావ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 25శాతం వాహన వినియోగాన్ని తగ్గించగలిగితే 50శాతం కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాదీయులకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయి. మెట్రోరైలులో ప్రయాణించే ప్రయాణికులు స్టేషన్లలో దిగి వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు అనుసంధానంగా ప్రజా రవాణా వ్యవస్థ లేదు. దీంతో మెట్రోరైలువైపు ప్రయాణికులు మొగ్గుచూపడం లేదు.


‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లలో పదిశాతం రహదారులుండాలి.. ప్రస్తుతం కేవలం ఆరుశాతం మాత్రమే  ఉన్నాయి. వ్యక్తిగత.. వృత్తిపరమైన రవాణా అవసరాలు  అనూహ్యంగా పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని