logo

IT: పనితీరు మదింపు.. నకిలీల తొలగింపు

కరోనా ప్రభావం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలైన ఐటీ రంగంలో కోతల కాలం మొదలైంది.

Updated : 24 Nov 2022 16:49 IST

సిబ్బందిపై ఐటీ సంస్థల అంతర్గత విచారణ

ఈనాడు- హైదరాబాద్‌: కరోనా ప్రభావం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలైన ఐటీ రంగంలో కోతల కాలం మొదలైంది. మూన్‌ లైటింగ్‌, ఆర్థిక సంక్షోభం భయంతో ఖర్చులు అదుపు చేసేందుకు కొన్ని ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని తొలగించగా.. మరికొన్ని వేటుకు సిద్ధమవుతున్నాయి. అనుభవం ఉన్నట్లు, వివిధ కోర్సులు చేసినట్లు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే ఓ ప్రముఖ బహుళ జాతి సంస్థ నకిలీ ధ్రువపత్రాలతో చేరిన వందలాది మందిని ఈ నెల తొలి వారంలో తొలగించింది. మరో ఏడు సంస్థలు ఉద్యోగుల్ని ఇలాగే వదిలించుకున్నాయి. ఇదే బాటలో నడిచేందుకు మరికొన్ని సంస్థలు సిద్ధమవుతున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. సంస్థలు అందించే సేవల్లో లోపాలకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

వెనుకబడిన వారిని గుర్తించి..

ఏటా లక్షలాది మంది ఇంజినీరింగ్‌ సహా వివిధ కోర్సులు పూర్తి చేస్తున్నా.. ఐటీ ఉద్యోగాలు కొందరికే దక్కుతున్నాయి. కొందరు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాల్లో చేరుతారు. ఐటీ రంగంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఐటీ సంస్థలు ఇలాంటి వారిపై దృష్టిపెట్టాయి. కొవిడ్‌ నేపథ్యంలో అన్ని రంగాల్లో ఒడిదొడుకులు ఎదురైనా.. వర్క్‌ ఫ్రం హోంతో ఐటీ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. నియామకాలూ చేపట్టాయి. వర్క్‌ ఫ్రం హోం పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో కార్యాలయాలు మొదలైన వేళ అలజడి ప్రారంభమైంది. కరోనా ముందు, తర్వాత ఉద్యోగాల్లోకి తీసుకున్న వారిలో కొందరు ఇతర ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. కొందరు వెనుకబడుతున్నారు. అప్పగించిన పని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేకపోతున్నట్లు ఐటీ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఫలితంగా సంస్థ సేవలపై కొంత మేర ప్రభావం  పడుతోందనే భావనతో ఉద్యోగుల పనితీరు మదింపు చేసి కోతకు సిద్ధమవుతున్నాయి.


తృతీయ పక్షంతో ఆరా

కొన్ని సంస్థలు నేరుగా మానవ వనరుల విభాగాలతో ఉద్యోగుల అర్హతలపై ఆరా తీస్తుండగా.. మరికొన్ని తృతీయ పక్ష సంస్థ (థర్డ్‌ పార్టీ ఏజెన్సీ)ల సేవల్ని వినియోగిస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో చేరారని తేలితే కొన్ని సంస్థలు విధుల్లోంచి తొలగిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కొత్త వారిని నియమించుకోవడంలో ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో చేరినా.. పనితీరు బాగుంటే సున్నితంగా హెచ్చరించి వదిలేస్తున్నట్లు హైటెక్‌ సిటీలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థ ఉద్యోగి తెలిపారు. మూన్‌ లైటింగ్‌, ఆర్థిక సంక్షోభం భయాలతో సిబ్బందిని తగ్గించుకోవడం సహా తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో గుబులు మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని